iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో బయటపడిన అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు సొరంగంలో ఏముంది…?

ఢిల్లీలో బయటపడిన అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు సొరంగంలో ఏముంది…?

పురాతన విషయాలు మనకు తెలిసినా, వాటిని మనం ఎక్కడైనా చూసినా ఉండే ఆసక్తి అదో ప్రత్యేకం. వార్తల్లో ఇలాంటివి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. చరిత్ర మీద ఆసక్తి ఉండే వారికి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. గూగుల్ సహాయంతో లేదా తమ వద్ద ఉన్న చరిత్ర పుస్తకాల ద్వారా ఏదొకటి వార్తల్లో వచ్చిన విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని సొరంగం ఒకటి బయటపడింది. అది ఇప్పటిది కాదు… స్వాతంత్ర్య పోరాటం చేసే సమయం నాటిది.

ఢిల్లీ అసెంబ్లీ వద్ద ఈ సొరంగం గుర్తించి… ఇది అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఉందని చెప్పారు ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్. దీనిపై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు మనకు వివరించారు. అసలు ఆయన చెప్పింది ఏంటీ అనేది చూస్తే… అప్పటి బ్రిటిష్ పాలకులు ఈ సొరంగాన్ని తరుచుగా ఉపయోగించారని, స్వాతంత్ర్య పోరాటం చేసినవారు ఎటువంటి ప్రతీకార చర్యలకు అవకాశం లేకుండా ఈ మార్గం నుంచి తీసుకువెళ్ళేవారని ఆయన మీడియాకు వివరించారు.

Also Read : జమ్మలమడుగు – ఒక ఫ్యామిలీ.. మూడు పార్టీలు

1993లో తాను శాసన సభకు ఎన్నికైన సమయంలో ఈ విషయం తన దృష్టికి వచ్చిందని… కాని చరిత్ర మాత్రం తెలుసుకోవడం సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే మరిన్ని విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ఈ నిర్మాణంకు సంబంధించి ప్రారంభం కనపడిందని మిగిలిన సొరంగాన్ని గుర్తించడానికి త్రవ్వకాలు జరపలేమని… ఎందుకంటే… ఈ సొరంగ మార్గంలో మెట్రో ప్రాజెక్టుతో పాటుగా పలు మురుగు నీటి కాలువల నిర్మాణం జరిగిందని… కాబట్టి ఈ సొరంగ మార్గాలు అన్నీ కూడా నాశనం అయ్యాయని వివరించారు.

భారత దేశ రాజధానిని 1912లో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ శాసన సభ భవనాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉపయోగించారని గుర్తు చేసారు. 1926లో ఈ భవనాన్ని న్యాయస్థానంగా మార్చినట్టు చెప్పిన ఆయన స్వాతంత్ర్య సమర యోధులను న్యాయస్థానానికి తీసుకెళ్ళడానికి ఈ సొరంగ మార్గాన్ని బ్రిటీష్ దొరలు ఉపయోగించారన్నారు. అలాగే మరో ఆసక్తికర విషయం కూడా చెప్పారు. ఉరి కంబం గది ఉన్నట్లు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన… 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా తాను ఆ గదిని పరిశీలించాలనే ఆసక్తి తనకు ఉందని పేర్కొన్నారు. దానిని స్వాతంత్ర సమరయోధుల పవిత్ర స్థలంగా మార్చి నివాళి అర్పిస్తామని చెప్తూ దీని చరిత్ర ఎప్పటికైనా తెలుసుకుంటా అని పేర్కొన్నారు.

Written 
Venkat G