iDreamPost
android-app
ios-app

90 ఏళ్ళ తల్లిని వేధిస్తున్న 60 ఏళ్ళ కొడుకు, కోడలు, ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్న ముంబయి స్థానిక కోర్టు

90 ఏళ్ళ తల్లిని వేధిస్తున్న 60 ఏళ్ళ కొడుకు, కోడలు, ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్న ముంబయి స్థానిక కోర్టు

ముసలి తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలో వేయాలనుకునేవాళ్ళు మళ్ళీ ఓసారి ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళే పిల్లల్ని ఇంట్లోంచి గెంటేసే రోజు రావచ్చు. ముంబయిలోని సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇలాంటి రోజు దగ్గరలోనే ఉందని సూచిస్తోంది. 90 ఏళ్ళ తల్లిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న 60 ఏళ్ళ కొడుకు, కోడలు ఇల్లు వదిలి పోవాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగింది?

ముంబయిలోని టార్డియోలో ఓ 90 ఏళ్ళ వృద్ధురాలు 60 ఏళ్ళ కొడుకు, అతని భార్యపై గృహ హింస చట్టం కింద గిర్గావ్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసింది. కొడుకు, కోడలు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, ఇంట్లో తనకు 50 శాతం వాటా ఉండగా దాన్ని తమకే ఇవ్వమంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ పెద్దావిడ భర్త 2000 సంవత్సరంలో చనిపోయాడు. ఫ్లాట్ లో సగం వాటా భార్య పేరున రాశాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు తాగొచ్చి తనను హింసించేవాడని, కోడలు కూడా ఇబ్బంది పెట్టేదని ఆవిడ ఆరోపించింది. ఒకసారి కొడుకు తాగిన మత్తులో తన గొంతు పట్టుకుని మరీ పేపర్లపై సైన్ చేయాలని బెదిరించాడని వాపోయింది. ఈ పరిస్థితుల్లో 2006లో ఇల్లు వదిలేసి వచ్చి ఆవిడ కూతురు దగ్గర ఉంటోంది. శారీరకంగా హింసించినందుకు కొడుకు, కోడలిపై నాలుగుసార్లు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది. చివరికి 2021లో గిర్గావ్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు కొడుకు, కోడలు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ తీర్పు ఇచ్చింది.

సెషన్స్ కోర్టు ఏమంది?  

కోర్టు తీర్పును ఆ జంట సెషన్స్ కోర్టులో సవాలు చేసింది. ఫ్లాట్ లో వాటా రానందుకే తన చెల్లి అమ్మతో ఈ కేసు వేయించిందని కొడుకు వాదించాడు. కానీ సేషన్స్ కోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. జీవితమంతా ఆ ఇంటితో అనుబంధం పెనవేసుకున్న పెద్దావిడను దాన్నుంచి దూరం చేయకూడదని అభిప్రాయపడింది. అయితే గృహ హింస చట్టం ప్రకారం తనను తన ఇంటి నుంచి దూరం చేయడం సరికాదని కోడలు వాదించింది. కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. భార్య అయినంత మాత్రాన భర్తకు వాటా ఉన్న ఇంటిపై ఆమెకు హక్కు ఉండదని, ఆమెకు కావాల్సినవి సమకూర్చాల్సిన బాధ్యత భర్తది మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది.

మన దేశంలో దాదాపు 55 శాతం మంది వృద్ధులు గృహ హింస బారినపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. ఈ హింస కోవిడ్, లాక్ డౌన్ తర్వాత మరీ ఎక్కువైందని సర్వే చెబుతోంది.