Idream media
Idream media
నిన్న మొన్నటి వరకు కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, వర్గాలతో నలిగిన పల్లెలు మారుతున్నాయి. ప్రజల చైతన్యంతో రాజకీయ కుట్రల కబంద హస్తాల నుంచి పల్లెలు విముక్తి పొందుతున్నాయి. పంచాయతీ ఎన్నికలంటే.. అసలు అర్థాన్ని గ్రహిస్తున్నాయి. సమష్టి నిర్ణయాలతో సమగ్రమైన అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నాయి. పార్టీ రహిత ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటూ.. తమ బతుకులకు బంగారు బాటలు వేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే ప్రొత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి.
సమస్యలెన్నో..
గ్రామాల్లో నేతలు పెంచి పోషించిన వర్గాల వల్ల సౌకర్యాలు లేకపోయినా.. పట్టించుకునేవారు కరువయ్యారు. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, తాగునీరు, వీధి దీపాల ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి పంచాయతీలకు ఏర్పడింది. ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జనాభా ఆధారంగా తలసరి ఇచ్చే నాలుగు రూపాయలు, ఆర్థిక సంఘం నిధులు, జాతీయ ఉపాధి హామీ నిధులే పంచాయతీలకు దిక్కవుతున్నాయి. ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూళ్ల ప్రస్తావన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అత్యధికం పంచాయతీల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు.
భరోసా.. చైతన్యం..
ఇప్పటి వరకు ఏపీలో జరిగిన రాజకీయం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు జరగుతోంది మరో ఎత్తు. గ్రామ, మండల, నియోజకవర్గ నేతలు తమ ప్రాబల్యం కోసం.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి.. వర్గాలను పెంచి పోషించారు. ప్రభుత్వ పథకాలు అందజేయడంలో వివక్ష చూపుతూ ఈ వర్గాలను కొనసాగించారు. ఈ తరహా రాజకీయానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వలంటీర్ వ్యవస్థతో చెక్ పెట్టారు. అర్హులందరికీ పథకాలు, ప్రభుత్వ సేవలు అందిస్తూ.. గత తాలుకూ గాయాలను మాన్పుతున్నారు. ప్రజలు కూడా ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటో తెలుసుకుని చైతన్యవంతులవుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా ఉంటుందనే భరోసా వారిలో కలిగింది. దీంతో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని అనేక పల్లెల్లో పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమవుతున్నాయి. అత్యంత సమస్యాత్మకం అనే వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని అనేక పంచాయతీలు ఏకగ్రీవబాటపట్టడడం గమనించాల్సిన విషయం.
అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ..
పల్లె అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నగదు పొత్రాహకాలను ప్రకటించింది. పంచాయతీ జనాభా రెండు వేల కన్నా తక్కువ ఉంటే ఐదు లక్షలు, 2–5 వేల మధ్య ఉంటే పది లక్షల రూపాయలు, 5–10 వేల మధ్య ఉంటే 15 లక్షల రూపాయలు, 10 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు 20 లక్షల రూపాయల ప్రొత్సాహకాన్ని ప్రభుత్వం ప్రటించింది. ఈ నిధులు పంచాయతీలకు రావడం వల్ల గ్రామాల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పల్లె ప్రజలు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు, సేవలను వైసీపీ ప్రభుత్వం అందిస్తుందన్న భరోసా ప్రజల్లో నెలకొనడంతో.. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. తమ గ్రామాల స్వరూపాన్ని శాశ్వతంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రయోజనాలు అనేకం..
పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఎన్నికలు లేకపోవడం వల్ల పల్లెలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. ప్రజల మధ్య సద్భావన పరిస్థితులు నెలకొంటాయి. విభేధాలు, మనస్పర్థలు మాటే వినిపించదు. పోటీ లేని కారణంగా.. అభ్యర్థులకు ఖర్చు ఉండదు. ఖర్చు లేకుండా ఎన్నికైన సర్పంచ్.. నిత్యం తమ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలా..? అని ఆలోచిస్తాడు. సాధారణంగా వచ్చే నిధులతోపాటు.. ప్రభుత్వం ఏకగ్రీవమైనందుకు ఇచ్చే ప్రోత్సాహక నిధులను సద్వినియోగం చేసుకుంటూ.. పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు. చుట్ట పక్కల గ్రామాలకు ఆదర్శంగానూ నిలవొచ్చు.