iDreamPost
iDreamPost
టాలీవుడ్ లో మల్టీ స్టారర్స్ తీయాలంటే ఉన్న ప్రధానమైన రిస్క్ అభిమానుల అంచనాలు అందుకోలేకపోవడం. ఇద్దరు హీరోలను పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఎవరి ఫ్యాన్స్ లెక్కలు వాళ్లకు విడిగా ఉంటాయి. కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా గొడవలు జరిగిపోతాయి. అందులోనూ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిక్కు అధికంగా ఉంటుంది. నటభూషణ శోభన్ బాబు గారికి 1985లో మహాసంగ్రామం ఇలాంటి పాఠమే నేర్పితే ఇకపై ఇంకో హీరో ఉన్న సినిమాలు చేయనని ప్రకటించి అలాంటి కథలు వినడం మానేశారు. కొన్నేళ్ల తర్వాత సోలో హీరోగా మార్కెట్ తగ్గినప్పుడు మళ్ళీ మల్టీ స్టారర్స్ ఒప్పుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా వచ్చిన బలరామకృష్ణులు ఓ మాదిరిగా సక్సెస్ అయ్యింది కానీ ఇక్కడ చెప్పబోయే ఉదాహరణ చాలా ప్రత్యేకమైంది.
1992లో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాత అశ్విని దత్ ‘అశ్వమేథం’ అనే సినిమా తీశారు. టాప్ ఫామ్ లో ఉన్న రాఘవేంద్రరావు గారు దర్శకులు. జంధ్యాల రచన ఇళయరాజా సంగీతం టీమ్ ని కూడా అదే లెవెల్ లో సెట్ చేసుకున్నారు. మొదటిసారి నందమూరి బాలకృష్ణ, శోభన్ బాబుల కాంబినేషన్ లో అశ్వమేథం అని ప్రకటించగానే అంచనాలు పెరిగిపోయాయి. బయ్యర్లు ముందే ఎగబడటం మొదలుపెట్టారు. మీనా, నగ్మ హీరోయిన్లు. అమ్రిష్ పూరి విలన్. క్రేజ్ రావడానికి ఇంత కన్నా ఏం కావాలి. చాలా వ్యయప్రయాసలు కూర్చి అశ్వినిదత్ డబ్బుని మంచినీళ్లలా ఖర్చు పెట్టారు.
అప్పటిదాకా ఏ బాలయ్య సినిమాకు జరగని బిజినెస్, ఓపెనింగ్స్ అశ్వమేథంకు దక్కాయి. అప్పటికే మ్యూజికల్ గా హిట్టయిపోయింది. దీంతో బ్లాక్ బస్టర్ ఖాయమనే అంచనాలో ఉన్నారు ప్రేక్షకులు. తీరా రిలీజయ్యాక అంచనాలు తారుమారయ్యాయి. తమ హీరోని పాత్రను చంపేసి అన్యాయం చేశారని శోభన్ బాబు ఫ్యాన్స్ అశ్వమేధంని ఇష్టపడలేదు. మరోవైపు కమర్షియల్ సినిమాను ఆశించిన బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఇది మితిమీరిన యాక్షన్ డ్రామా తరహాలో ఉండటంతో వాళ్ళకూ నచ్చలేదు. ఫలితం ఫ్లాప్. నష్టాలు తప్పలేదు. పెట్టుబడి మొత్తం వెనక్కు రాలేదు. పంపిణిదారులూ నష్టపోయారు. తనను కలిసిన ఫ్యాన్స్ కు శోభన్ బాబు అతికష్టం మీద సర్దిచెప్పాల్సి వచ్చింది. దీని తర్వాత శోభన్ బాబు మల్టీ స్టారర్స్ కి గుడ్ బై చెప్పేశారు.