iDreamPost
android-app
ios-app

కొత్త ఎమ్మెల్యే.. గ్యాప్‌ ఇవ్వలేదు.. కానీ వస్తోంది!!

కొత్త ఎమ్మెల్యే.. గ్యాప్‌ ఇవ్వలేదు.. కానీ వస్తోంది!!

ఆయనది రాజకీయ కుటుంబమే.. కానీ ఆయన మాత్రం రాజకీయాలకు కొత్త. వైద్య వృత్తి చేసుకుంటూ ఉన్న ఆయన అనుకోకుండా నియోజకవర్గానికి ఇంచార్జి అయ్యారు. ఆ తర్వాత ఎన్నో కష్ట నష్టాల కోర్చి పార్టీ కోసం కష్టపడ్డాడు. ప్రతి గ్రామాన్ని ఒకటికి రెండు సార్లు తిరిగి కార్యకర్తలను తనవైపు తిప్పుకున్నారు. నియోజకవర్గంలో పాతుకుపోయిన ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇద్దరు బడా నాయకులకు చెక్‌ పెడుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ‘ఆయనకు రాజకీయాలు తెలియవు.. అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ మాట్లాడిన స్థానిక నేతలకు నోట మాట రాకుండా నియోజకవర్గంలో కష్టపడి ఎదిగారు. ఇవన్నీ చూసిన ప్రజలకు ఆయనపై గురి కుదిరింది. ఫ్యాక్షన్‌ ప్రాంతంలో శాంతి కపోతంలా కనిపించారు. అదీకాక పక్కనే సీఎం నియోజకవర్గం ఉండడం, ఫ్యాన్‌ గాలి తీవ్రంగా వీయడంతో రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఏకంగా 50 వేలపైన మెజారిటీ సాధించి ఔరా అనిపించారు. ఇదంతా చెబుతోంది.. ఎవరి గురించి అనుకుంటున్నారా? ఆయనే మూలె సుధీర్‌రెడ్డి. జమ్మలమడుగు ఎమ్మెల్యే.

ఎన్నికల ముందర ఉన్నంత చురుగ్గానే ఆ తర్వాతా వ్యవహరిస్తూ వచ్చిన ఆయనకు ఈ మధ్య కార్యకర్తలతో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ పెరిగిపోతోందని అభిమానులు పేర్కొంటున్నారు. బలగాన్ని పెంచుకునే క్రమంలో మాజీ మంత్రి ఆది వర్గీయులను చేర్చుకుంటూ పోతున్నారు. అయితే పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడిన కార్యకర్తలపై చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం ఎవరినైనా చేర్చుకోవడంలో అభ్యంతరం లేదని, అయితే ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడక్కడా గ్రామాల్లో కొత్త వర్సెస్‌ పాత అనేలా పరిస్థితి తయారయ్యింది. అదే సమయంలో గ్రామ స్థాయిలో పనుల విషయంలోనూ న్యాయం జరగడం లేదని పేర్కొంటున్నారు. ఇటీవల జమ్మలమడుగు పట్టణంలో ఒక వార్డులో జరిగిన మీటింగ్‌కు స్థానిక నేతలు రామని స్పష్టం చేయడంతో ఆయన మీటింగ్‌ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కార్యకర్తలతో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, దీన్ని వీలైనంత త్వరగా అధిగమించాల్సిన అవసరం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు.