iDreamPost
iDreamPost
‘మీ అణిచివేతతో నన్ను నా కుటుంబాన్ని ఆత్మహత్యకు పూనుకునేలా తమరు ప్రయత్నించారు. మీ ప్రయత్నం బాటలోనే నేను ఆలోచన చేశాను. కాని నా కుటుంబాన్ని అవమానపరిచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాను’ అని మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పలు విషయాలను ముద్రగడ లేవనెత్తారు. ఆ నాటి ఘటనలు గుర్తు చేస్తూ చంద్రబాబును ప్రశ్నిస్తూ, నిలదీస్తూ ముద్రగడ లేఖ సాగింది.
కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు సర్కార్ ముద్రగడ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంటి వద్ద దీక్షకు దిగిన ముద్రగడను, అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఆ సామాజివర్గంలోనే కాకుండా పలు వర్గాల వారు తప్పుపట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు తన కుటుంబాన్ని అవమానించారని కన్నీళ్లు పెట్టకున్న నేపథ్యంలో ముద్రగడ లేఖను సందించారు.
ఈ సందర్భంగా ముద్రగడ తన లేఖలో… మా జాతికి మీరు ఇచ్చిన హామీ నేరవేర్చమని దీక్ష మొదలు పెట్టిన రోజునే గౌరవ తమరి పుత్రరత్నం గారు మా ఆవరణలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్ చేశారు. ‘ఆ లంజా కొడుకుని (నన్ను) బయటకి లాగారా లేదా? తలుపులు బద్దలు కొట్టి నా శ్రీమతిని లంజా లెగవే అని బూటు కాలుతో తన్నించి ఈడ్చుకెళ్లారా లేదా? అని అడిగారు. నా కోడలిని లంజా నిన్ను కొడితే దిక్కెవరే అని తిట్టించింది, నా కొడుకుని లాఠీలతో కొట్టుకుని తీసుకువెళ్లింది తమకు గుర్తు లేదాండి? అని ముద్రగడ లేఖలో చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పుడు తమరి నోటి వెంట ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. ‘బాబు గారు మీ దృష్టిలో మా కుటుంబం లం..ల కుటుంబమా? మీరు, మీ శ్రీమతి గారు దేవతలా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మేమేంటి, మా కొంపలు ఏమిటి? అని నిలదీశారు.
‘హాస్పిటల్ అనే జైలులో చిన్నగదిలో ఉంచారు. బట్టలు మార్చుకోవడానికి కూడా లేకుండా, స్నానాలు చేయడానికి గాని వీలు లేకుండా 14 రోజులు ఏ కారణంతో ఉంచారు? ఆ చిన్న గదిలో మా నలుగురితోపాటు మరో ఆరుగురు పోలీసువారిని పగలు, రాత్రుళ్లు ఉంచడం భావ్యమా? రేకు కూర్చీలతో శబ్దాలు చేయిస్తూ, ప్రతీ రోజు రాత్రి మీ ఆదేశాలతో పోలీసు అధికారులు మా ముఖాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫోటోలు తీయించి పంపించమనడం రాక్షసానందం పొందడం కోసమే కదా బాబుగారు? అని ముద్రగడ లేఖలో ప్రశ్నించారు.
మీరు చేయించిన హింస తాలూకా అవమానాలు భరించలేక వాటిని తలచుకుంటూ నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాము. మా నాలుగు సంవత్సరాల మనవరాలు అర్థ రాత్రులు గుర్తుకు వచ్చి ఎలా భయపడేదో చెప్పడానికి మాటలు చాలవన్నారు. భూమి గుండ్రంగా ఉన్న సంగతి మరవద్దండి. నన్ను అంత దారుణంగా అణచివేయాలని ఎందుకు అనిపించిందని ప్రశ్నించారు. ఆ రోజున మీ పదవికి అడ్డు జగన్‌మోహన్‌రెడ్డి కాని తాను కాదని, కాని ఆయనను వదిలేసి, నా మీద కట్టలు తెంచుకునే కోపాన్ని, క్రూరత్వాన్ని ఎందుకు చూపారన్నారు.
నన్ను తీహార్ జైలుకు పంపించాలని చూశారు. ఆరు వేల మంది పోలీసులను ప్రయోగించారు. నా ఇంటి చుట్టూ డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. హెలికాఫ్టర్‌ను సిద్ధం చేశారు. నా ఇంటి వద్ద భయానకమైన వాతావరణం సృష్టించారు. కార్గిల్ యుద్ధభూమిని తలపించేలా చేశారు’ అని ముద్రగడ గుర్తు చేశారు. ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తు చేయాలనే తాను ఈ లేఖ రాస్తున్నానని, అంతేకాని మిమ్మల్ని, మీ శ్రీమతిని అవమానించడం తన ఉద్దేశ్యం కాదన్నారు. ఇంకా లోతుగా రాయాలంటే పేజీలు సరిపోవని ముద్రగడ ఎద్దేవా చేశారు. పోలీసులు తనని అరెస్టు చేసిన రోజున గదిలో డబ్బులు, సెల్‌ఫోన్ చోరీకి గురయ్యాయన్నారు.
మీ భార్యకు అవమానం జరిగిందని మీరు ఆవేదనతో వెక్కివెక్కి కన్నీరు కార్చడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను. కొద్డోగొప్పో మీ కన్నా మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. మా తాత కిర్లంపూడికి మునసబు అయినా జిల్లా మునసబుగా పేరొందారు. నా తండ్రిని ప్రజలు ప్రేమతో రెండుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు అని ముద్రగడ గుర్తు చేశారు. మీరు, నేను 1978లో అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. మీ మావయ్య గౌరవ ఎన్టీ రామారావు గారి వద్ద, తరువాత మీ పిలుపు మేరకు మీ వద్ద సంవత్సరాలు పనిచేశాను. ఎప్పుడూ మీతో ఉన్నప్పుడు మీకు వెన్నుపోటు పొడవాలని ప్రయత్నం చేయలేదని ముద్రగడ పేర్కొన్నారు.
కార్యకర్తలు, బంధువులు మీడియా ద్వారా సానుభూతి విపరీతంగా పొందే అవకాశం తమరికి మాత్రమే వచ్చింది. ఈ రోజు తమరు పొందుతున్న సానుభూతి, ఆనాడు నేను పొందకుండా ఉండడం కోసం మీడియాను బంధించారు. ఆ రోజు నుంచి నన్ను అనాథ ను కూడా చేయడం తమరి భిక్షే అని ముద్రగడ అన్నారు.
బాబు గారు శపథం చేయకండి, అవి సాధించేవారు వేరే ఉన్నారన్నారు. దివంగతలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు, జయలలిత, మమతా బెనర్జీ వంటి వారికి మాత్రమే సాధ్యమని, మనవంటి వారికి అవి నీటిమీద రాతలేనని ముద్రగడ ఎద్దేవా చేశారు. ప్రజలు బూటు కాలితో తన్నించుకోవడం కోసమో, కేసులు పెట్టించుకోవడం కోసమో ఓట్లు వేయలేదని, చంద్రబాబు దీనిని గుర్తించాలని ముద్రగడ హితవు పలికారు.