తెలంగాణలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి పది లక్షల లంచం కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది.
వివరాల్లోకి వెళితే కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు లంచం కేసులో నిందితుడిగా ఉన్న ధర్మారెడ్డి, వాసవి శివ నగర్ కాలనీలో ఈ ఆదివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎమ్మార్వో నాగరాజు మీద నమోదు అయిన రెండో కేసులో నిందితుడిగా ధర్మా రెడ్డితో పాటు ఆయన కుమారుడు శ్రీకాంత్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. మాజీ తహసీల్దార్ నాగరాజు ద్వారా ధర్మారెడ్డి కుటుంబం 40 ఎకరాలకు నకిలీ పాసుపుస్తకాలు తీసుకుంది. ఈ కేసులో అరెస్టై 33 రోజుల పాటు జైల్లో ఉన్న ధర్మారెడ్డి ఇటీవలే బెయిల్ పై బయటకు రావడం గమనార్హం.
కాగా గతంలో కోటి రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో నాగరాజు జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒకే కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు పలు సందేహాలను రేకెత్తిస్తోంది. ధర్మారెడ్డి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.