iDreamPost
android-app
ios-app

ఆశానువాహుల్లో ఆశలునింపిన కోర్టు తీర్పు.. కౌంటింగ్ డే .. గెట్ రెడీ..

ఆశానువాహుల్లో ఆశలునింపిన కోర్టు తీర్పు.. కౌంటింగ్ డే .. గెట్ రెడీ..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పై ఏపీ SEC నీలం సాహ్ని సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి కౌంటింగ్ ప్రక్రియను సజావుగా ముగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. న్యాయవివాదాల నేపథ్యంలో ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరికి ముగింపు దశకు వచ్చింది. నోటీఫికేషన్ జారీ నుంచి ఎన్నికల నిర్వహణతో పాటు అన్ని చోట్ల వివాదాస్పదమైన పరిషత్ ఎన్నికల ఘట్టం హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో ఓ కొలిక్కి వచ్చినట్లైంది. హైకోర్టు తీర్పు మేరకు ఈ నెల 19న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరపనున్నట్లు SEC నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై పలువురు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసులు కారణంగా కౌంటింగ్ ఆలస్యం కావడంతో చాలా మంది అభ్యర్థులు రిజల్ట్ చూడకుండానే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు. న్యాయపరమైన వివాదాలతో తమ ఎన్నిక చెల్లుబాటు కాకుండా పోతుందేమోనని ఏకగ్రీవమైన అభ్యర్థులు కూడా మదనపడ్డారు. పార్టీ బీఫామ్ తెచ్చుకోవడంలో పడిన శ్రమ, ప్రచారం, ఖర్చు, సమయం వృథా అవుతాయోమననిని భయపడ్డారు. తమకు వచ్చిన అవకాశం ఎక్కడ చేతికి అందకుండా పోతుందేమనని తీవ్రమైన క్షోభను అనుభవించినట్లు పలువురు పోటీదారులు, ఏకగ్రీవమైన అభ్యర్థులు చెబుతున్నారు. కోర్టు తీర్పుతో ఎట్టకేలకు తమ భయాందోళనకు తెరపడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగినప్పటికీ కోర్టు కేసులు కారణంగా కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిద కారణాలతో 375 స్థానాలకు ఎన్నిలు జరగలేదు. పోటీ చేసిన అభ్యర్థులు చనిపోవడంతో 81 చోట్ల పోలింగ్ వాయిదాపడింది. 9672 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జరగగా, ఏకగ్రీవాలు, వాయిదా పడిన స్థానాలు పోను 7,220 స్థానాల్లో 18,782 అభ్యర్థులు పోటీ చేశారు.

రాష్ట్రంలో మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా,, వివిద కారణాలతో 8 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 2020 మార్చి 7న 652 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు మృతి చెందిన 11 చోట్ల ఎన్నికలు నిలిపివేయగా.. 515 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 2058 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

గత ఏడాది మార్చి 7న అప్పటి SEC నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు అదే నెల మార్చి 24న కౌంటింగ్ పూర్తి పచేయాలి. కానీ ప్రక్రియ మధ్యలో ఉండగానే కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేశారు. ఇక నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆ పదవిలోకి వచ్చిన కొత్త SEC నీలం సాహ్ని.. ఈ ఏడాది ఏప్రిల్ 1న పోలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు.

అయితే ఈ నిర్ణయం సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య, హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 8న జరగాల్సిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేస్తూ 6వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే వాటిని సవాలు చేస్తూ SEC అప్పీల్ కు వెళ్లగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చిన ధర్మాసనం.. కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఎన్నికలను మొదటి నుంచి ప్రారంభించాలంటూ బీజేపీ, జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వేసిన పిటిషన్ లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలంటూ మే 21న తీర్పు చెప్పారు. నోటిఫికేషన్ ఆగిన చోట నుంచే మళ్లీ ప్రారంభించాలని తీర్పులో పేర్కొన్నారు.

అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై SEC తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు అప్పీల్ వెళ్లగా విచారణ జరిపిన ధర్మాసనం … కౌంటింగ్ నిర్వహణకు అనుమతి తెలిపింది. స్థానిక ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశమే తప్ప.. ప్రతి ఎన్నికకు అదే కోడ్ అమలు చేయాలన్నది సుప్రీంకోర్డు ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది.

సెలబ్రేషన్స్ కు సమాయత్తం..

ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో భారీ విజయాలతో చరిత్ర సృష్టించిన వైసీపీ శ్రేణులు మరోసారి గెలుపు సంబరాలకు సమాయత్తం అవుతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వలే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్ష విజయంతో రికార్డు సృష్టిస్తుందని జోస్యం చెబుతున్నారు.