జనంలోకి వెళ్లేదెలా ?ఎంపీల అంతర్మధనం

ఒరే గాభరా పడకర్రా..మన ఎంపీ గారికి చెప్పి ఫండ్స్ తెప్పించి ఆ రోడ్డు వేయించేస్తాను… ఒక్క నెలాగండి ఆ స్కూల్ బిల్డింగ్ ఎంపితోనే ప్రారంభింపజేస్తాను. అలా అంటే ఎలా…ఎంపిగారు ఢిల్లీలో ఉన్నారు రాగానే వారంలోనే మరుగుదొడ్లు పూర్తి అవుతాయి…కల్వర్టు కూడా ఎంపితో చెప్పి చేయిస్తానులే ….ఇవీ గ్రామాలు, మండలాల్లో నాయకులకు ఉన్న ధీమా..భరోసా ..అవును ఎంపిల్యాడ్స్ అంటే జేబులో నేరుగా డబ్బులు ఉన్నట్లే..

ప్రతి ఎంపీకి ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు ఇస్తుంది.ఆ డబ్బును వారు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయొచ్చు.. దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు లక్షల జనాభా కు ఏడాదికి ఐదు కోట్ల నిధులు అంటే తక్కువే గానీ అంత ఖచ్చితంగా టైముకు రిలీజ్ అవుతాయి కాబట్టి ఎంపిల్యాడ్స్ అంటే ఎంపీలకు ఆయన పరిధిలోని ,మండల స్థాయి నాయకులకు ఓ నమ్మకం..మన డబ్బులే కదా బిల్స్ రావన్న బెంగలేదు..మంచిగా నాలుగైదు పనులు చేయొచ్చు అనే విశ్వాసం.

అయితే కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు ఎంపీలకు ఎంపీ ల్యాడ్స్ ఇచ్చేది లేదని కేంద్రం చేసిన ప్రకటనతో దేశంలోని ఎంపీల గొంతులో వెళక్కాయ అడ్డం పడినట్లు అయింది. 2020-21, 2021-22సంవత్సరాలకు సంబంధించి కేంద్రం దాదాపు 7900 కోట్లు నిలిపివేయనుంది.

అంటే ఈ రెండేళ్లపాటు ఎంపీలు తమ నిధులతో గ్రామాల్లో మండలాల్లో ఏమీ చేయలేరన్నమాట.కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డవున్ దెబ్బకు కేంద్రానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోవడం, ఇటు రాష్ట్రాలకు చేయాల్సిన సాయం పెరగడంతో కేంద్రం ఇక రెండేళ్లపాటు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వరాదని నిర్ణయించింది. ఇది ఎంపీలపాలిట అశనిపాతమనే చెప్పాలి.గ్రామాల్లోకి,మండలాల్లోకి వెళ్లాలంటే జనం ఏమి అంటారోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది.ఎన్నికల సమయంలో అవి చేస్తాం,ఇవి చేస్తాం..రోడ్లు వేస్తాం…బిల్డింగులు, ఆస్పత్రులు,అంటూ హామీలు ఇచ్చి ఎంపీలు అయినవారు ఇప్పుడు ఎలా ప్రజాలముందుకు వెళ్తారో చూడాలి.దానికితోడు ఎంపీ నిధులు లేకపోవడంతో గ్రామాలు, మండలాల్లో వారికోసం ఎదురు చూసేవారు, ఎంపీ గారు ఢిల్లీ నుంచి రాగానే ఇంటికొచ్చి కలిసేవారు తగ్గిపోయే అవకాశం ఉంది. కాయలివ్వని చెట్టు దగ్గరకు ఎవరు వెళతారు..నీళ్లు లేని నది దగ్గరకు ఎవరు పోతారు …ఈ పరిస్థితిని ఎంపీలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి…

Show comments