రామతీర్థం కోదండరామస్వామి దర్శనానికి వెళ్లిన తనపై హత్యాయత్నానికి ప్రయత్నం చేసారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నానికి టీడీపీ నేతలైన చంద్రబాబునాయుడు, కళా వెంకటరావు, అచ్చెన్నాయుడులు ప్రధాన కారణమని విజయసాయిరెడ్డి పిర్యాదులో పేర్కొన్నారు.
అసలేం జరిగింది…
రామతీర్థం కోదండరామ ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు నిరసనగా డిసెంబరు 2 న టీడీపీ, బీజేపీ నేతలు రామతీర్థానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం మెట్లమార్గం మొదట్లో కొబ్బరికాయ కొట్టి బోడికొండపైకి వెళ్లారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చాయి. అదే సమయంలోఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం వెళ్లడంతో రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొండపైకి వెళ్తున్న విజయసాయిని టీడీపీ, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల సాయంతో ఎంపీ విజయసాయిరెడ్డి కొండపైకి చేరుకున్నారు. తిరుగు ప్రయాణం సమయంలో టీడీపీ, బీజేపీ నేతలు విజయసాయిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు.
అంతేకాకుండా ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదుతూ చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. జైశ్రీరాం అంటూ నినదించారు. ఇదే సమయంలో రాయి తగలడంతో విజయసాయిరెడ్డి కారు అద్దం పగిలింది. దీంతో, ఆయన కారు నుంచి కిందకు దిగి, పోలీసుల సహకారంతో నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్లి, వేరే కారులో వెళ్లిపోయారు.
కాగా తనపై టీడీపీ శ్రేణులు హత్యాయత్నానికి పాల్పడటంపై ఎంపీ విజయసాయిరెడ్డి విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధ చట్టం (పీడీపీపీ)లోని సెక్షన్లు 307, 323, 326, 503, 506 కింద ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపై దాడి చేసిన వారిని గుర్తించేందుకు వీడియోలు పరిశీలిస్తున్నామని నెల్లిమర్ల ఎస్సై దామోదర్‌రావు వెల్లడించారు. త్వరలోనే దాడికి పాల్పడ్డవారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు.