iDreamPost
android-app
ios-app

బాబు ధీమాను మెచ్చుకోవాల్సిందే.. కాక‌పోతే..

బాబు ధీమాను మెచ్చుకోవాల్సిందే.. కాక‌పోతే..

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 13,081 స్థానాల‌కు గాను టీడీపీ మ‌ద్ద‌తు దారులు గెలిచింది 2, 100 మాత్ర‌మే. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 75 స్థానాల‌కు గాను ఆ పార్టీ గెలుచుకుంది కేవ‌లం ఒకే ఒక‌టి. 11 కార్పొరేష‌న్ల‌కు గానూ టీడీపీ గెలుచుకుంది ఎన్నో తెలుసు క‌దా.. శూన్యం. ఆ త‌ర్వాత జ‌రిగిన తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో బొక్క బోర్లాప‌డింది. ఓట్ల శాతంలో గ‌తం కంటే దిగ‌జారింది. ఇక ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అయితే పోటీ చేసే సాహ‌సం కూడా చేయ‌లేక‌పోయింది.. అయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా ఏమ‌న్నారో తెలుసా.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే ఆ పార్టీయే గెలుస్తుంద‌ట‌. 2024 ఎన్నికల్లో టీడీపీ నూటికి నూరు శాతం గెలుస్తుందని, ఇందులో అనుమానం అవసరం లేదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేశారు. మ‌రి బాబు ధీమాను మెచ్చుకోవాల్సిందేగా.

గ‌త ఎన్నిక‌ల్లో బాబు ఓడిపోవ‌డానికి మంచిని అర్థం చేసుకోలేని ప్రజానీకం వ‌ల్లేన‌ని తాజాగా బాబు సెల‌విచ్చారు. లక్ష కోట్ల అవినీతి చేసిన వ్యక్తిని సరిగా విశ్లేషించలేని ప్రజానీకం ఉన్నప్పుడు తమకు బాధలు తప్పవన్నారు. తమ వాళ్లు అందరూ బాధపడుతున్నారని, తనను మారాలంటున్నారని, కానీ దానికి ముందు నిలబడి ఉండాలి కదా అని నిర్వేదం వ్యక్తం చేశారు. ఇంత నిర్వేదంగా మాట్లాడిన చంద్ర‌బాబు 2024 ఎన్నిక‌ల్లో కూడా అదే జ‌న‌మే క‌దా ఓట్లు వేయాల్సింది. అప్ప‌టిలోగా అర్థం చేసుకుంటార‌నా.., లేదా బాబే అర్థం అయ్యేలా చేస్తారో కానీ గెలుపుపై మాత్రం ధీమాగానే మాట్లాడుతున్నారు. మ‌రి వైసీపీ నాయ‌కులు ఊరుకుంటారా..? ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి దీనిపై త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు.

ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి టిడిపిది అని.. బక్వాస్ మాటలతో నవ్వులపాలు కావొద్దు అని చంద్రబాబుకు చురకలు అంటించారు. “ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తన పార్టీ గెలుస్తుందట. సంక్షేమం అమలులో విఫలమైనందువల్ల ప్రజలు జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారట! ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి నీది. డిపాజిట్ దక్కితే చాలనుకున్న సంగతి ప్రజలింకా మర్చిపోలేదు. బక్వాస్ మాటలతో నవ్వులుపాలు కావొద్దు చంద్రం. స్వీయ ఆరాధన ఏ స్థాయికి చేరిందంటే 5 కోట్ల మంది ప్రజలు తనను తిరస్కరించి సరిదిద్దుకోలేని తప్పు చేశారని భ్రమపడుతున్నాడు. వాళ్లకు ఇంత చైతన్యం ఎలా వచ్చిందని విస్మయం చెందుతున్నాడు బాబు. రెండేళ్ల తర్వాత కూడా అలాగే ఆలోచిస్తున్నాడంటే మెంటల్ కండిషన్ అనుమానించాల్సిందే.” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

Also Read : కల్పించిన ఉద్యోగాలు కనిపించడంలేదా అశోక్‌బాబూ..?