Idream media
Idream media
తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్ లో వ్యూహాత్మక పోటీ ఏర్పడింది. కొంత కాలంగా తెలంగాణలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఇక్కడ పోటీ జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఫలితాల అనంతరం కూడా ఆ రెండు పార్టీలే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. కానీ, నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదే అదునుగా వరుస ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ ఇక్కడ ఎలాగైనా సత్తా చాటాలని, జానారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్థానికంగా ఆయనకున్న పేరుతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. తొలుత జానారెడ్డి ఒంటరి పోరు ప్రారంభించినా తర్వాత, తర్వాత ఒక్కొక్కరూ కలవడం మొదలుపెట్టారు. వారందరిలో అందరి దృష్టీ రేవంత్ రెడ్డిపైనే ఉంది.
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఇక్కడ గెలిచి తన సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్, ప్రధానంగా జానారెడ్డి విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఓడిపోయిన సానుభూతి పొందేలా జానారెడ్డి కాస్త సఫలం చెందారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై గట్టివాయిస్ వినిపించేందుకు కాంగ్రెస్ నేతలు అందరినీ రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికి దిగడం, తనదైన శైలిలో దూసుకెళ్లడం కోసం ప్రయత్నిస్తున్నారు.
Also Read : జానా సొంత ఊర్లో గొడవ.. ఎవరికీ లాభం..?
గతంలో టీడీపీలో ఉన్న నాటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నంత వరకు కూడా రేవంత్ రెడ్డి దూకుడు చాలా డిఫరెంట్. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. దానిలో భాగంగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఓ దశలో రేవంత్ రెడ్డికే ఖాయమైందన్న వార్తలూ వచ్చాయి. దీనిపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో తెరపైకి జీవన్ రెడ్డి పేరు అకస్మాత్తుగా వచ్చింది. అయితే, ఒకటి, రెండు రోజుల్లో అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడబోతుందన్న తరుణంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో బ్రేక్ పడింది.
అది అలా ఉంటే ఇప్పుడు సాగర్ ప్రచారంలో జానారెడ్డి గెలుపు కోసం రేవంత్ రెడ్డి కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. జానారెడ్డికి ఇద్దరు కొడుకులు కాదు.. ముగ్గురు కొడుకులు ఉన్నారు ఖబడ్డార్ అంటూ జానాపై ఆరోపణలు చేస్తున్న వారికి వార్నింగ్ లు ఇస్తున్నారు. రాజకీయ అనుభవం, నిత్యం మీకు అందుబాటులో ఉండే జానారెడ్డి ని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు.
విశేషమేమిటంటే.. టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి దక్కకుండా అడ్డుపడ్డ సీనియర్లలో జానారెడ్డి కూడా ఉన్నారన్న పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ప్రకటన వాయిదా వేయడంలో కూడా జానారెడ్డిదే కీలక పాత్ర. అంతేగాకుండా, ఎన్నిక నోటిఫికేషన్ కు ముందు పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి ముగింపు సభకు జానారెడ్డి, ఉత్తమ్ వంటి వారు హాజరు కాలేదు. దీంతో పార్టీలో సీనియర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలో జానారెడ్డి గెలుపు కోసం పోరాడడం ఆసక్తికరంగా మారింది. దీని వెనుక అధిష్ఠానం రేవంత్ రెడ్డి తగిన హామీ ఇవ్వడమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి అధిష్ఠానం ఎటువంటి హామీ ఇచ్చిందో, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also Read : కేటీఆర్ కు అంత కోపం ఎందుకు వచ్చింది ?