iDreamPost
android-app
ios-app

రఘురామ, వారం అంటే వారం కాదా..?

రఘురామ, వారం అంటే వారం కాదా..?

నిత్యం వార్తల్లో ఉండాలని భావిస్తూ తనను పార్లమెంట్‌కు పంపిన పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామరాజు మరోసారి వార్తల్లో నిలిచేలా మాట్లాడారు. ఫిబ్రవరి 5 వరకు తనపై వేటు వేయించేందుకు సమయం ఇస్తున్నానని, లేకపోతే ఆ తర్వాత తానే రాజీనామా చేస్తానని గత నెలలో ప్రకటించిన రఘురామకృష్ణంరాజు.. ఆ సమయం దాటిపోవడంతో అందరూ ఎప్పుడు రాజీనామా చేస్తారా..? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజీనామా అంశంపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తాను తన రాజీనామా విషయంలో డెడ్‌లైన్‌ ఏమీ విధించలేదని నాలుకమడతేశారు. రాజకీయాల్లో వారం అంటే వారం కాదని, రాజీనామా అంటే రాజీనామా కాదనే విషయాన్ని రఘురామరాజు తన తీరుతో నిరూపిస్తున్నారు.

తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని, జార్ఖండ్‌ ముఠాకు సుఫారీలు ఇచ్చారని, పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తారంటూ.. మొన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన రఘురామకృష్ణంరాజు.. సంక్రాంతి సంబరాలకు తన స్వగ్రామం వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సంక్రాంతికి ముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు కూడా. స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల తర్వాత రాజీనామాపై ప్రకటన చేస్తానని చెప్పారు. ఆ మేరకు భారీ ర్యాలీతో విజయవాడ విమానాశ్రయం నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏపీ ప్రభుత్వంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేయడంతో.. విచారణకు హాజరవుతానని చెప్పిన రఘురామరాజు అటునుంచి అటే ఢిల్లీకి వెళ్లి ఇక మొహంచాటేశారు. విచారణకు హాజరుకావాల్సిన రోజున ఆరోగ్యం బాగోలేదు సార్‌.. అంటూ సీఐడీకి లేఖ రాసి తుర్రుమన్నారు. ఢిల్లీలో ప్రెస్‌మీట్లు పెట్టుకుంటూ, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ఎప్పటి మాదిరిగానే కాలం వెల్లదీస్తున్నారు.

అమరావతి అజెండాగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి గెలుస్తానని ప్రగల్భాలు పలికిన రఘురామరాజు.. మొత్తం ఎపిసోడ్‌ను మరచిపోయినట్లుగా.. రాజీనామాపై డెడ్‌లైన్‌ పెట్టులేదంటూ మాట్లాడి నవ్వులు పూయిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులకు విమర్శలు చేసే అవకాశం ఇస్తున్నారు. రాజీనామా చేస్తానని రఘురామరాజు అనగానే… అందరూ ఆ విషయంపై చర్చించుకున్నారు. రాజీనామా చేస్తే నరసాపురంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో కూడా విశ్లేషణలు సాగించారు. తెలంగాణలో జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికను గుర్తు చేసుకున్నారు. అయితే ఇవన్నీ సినిమాలో కామెడీ మాదిరిగా మారిపోవడంతో రఘురామరాజును అందరూ లైట్‌ తీసుకుంటున్నారు. సీఐడీ నోటీసులకే భయపడిపోయి ఢిల్లీకి వెళ్లిపోయిన రఘురామరాజు మళ్లీ రాజీనామా చేస్తా.. పోటీ చేస్తా.. గెలుస్తా.. అంటూ మాట్లాడితే ఎవరూ పెద్దగా పట్టించుకోబోరు. అయినా రఘురామరాజు తన రాజీనామాపై ప్రకటనలు చేయకుండా ఉండకపోవచ్చు.

Also Read : సీఎంను మరోసారి కలవనున్న చిరంజీవి