iDreamPost
android-app
ios-app

కోమటిరెడ్డి.. ఒక్క రోజులో ఎంత మార్పు..?!

కోమటిరెడ్డి.. ఒక్క రోజులో ఎంత మార్పు..?!

రాజకీయ నేతల వ్యవహార శైలి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. గంటల వ్యవధిలో కొంత మంది నేతలు తమ రాజకీయ తీరును మార్చుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజు వ్యవధిలో చేసిన రాజకీయ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిని ఆశించి భంగపడిన కోమటిరెడ్డి.. తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వెల్లగక్కి.. రోజు వ్యవధిలోనే శాంతించారు.

టీపీసీసీ అధ్యక్ష పదవిని మాల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం కట్టబెట్టింది. ఈ పదవిని రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు లాంటి పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆశించారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై చాలా కాలం పాటు మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్‌ అధిష్టానం.. చివరకు రేవంత్‌ రెడ్డి వైపు మొగ్గింది. ఈ నిర్ణయం కోమటిరెడ్డికి ఏ మాత్రం రుచించలేదు. అగ్గిమీద గుగ్గిలం అయిన కోమటిరెడ్డి.. పీసీసీ పదవి కూడా ఓటుకు నోటు లాంటిదేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ పదవిని కొనుక్కున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసి పతాక వార్తల్లో నిలిచారు.

నిన్న ఈ స్థాయిలో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. ఈ రోజు స్వరం మార్చారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దంటున్నారు. ఇక నుంచి ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. భవనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఒక్క రోజులో వెంకట రెడ్డిలో వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెర వెనుక ఏం జరిగింది..? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అధిష్టానం బుజ్జగించిందా..? పీసీసీ పదవి ఆశించి భంగపడిన కోమటి రెడ్డికి ఏం హామీ లభించింది..? అనే చర్చ తెలంగాణ రాజకీయల్లో సాగుతోంది.

Also Read : పీసీసీ పదవి – ఓటుకు నోటులాంటిదే అంటున్న కాంగ్రెస్ ఎంపీ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయంగా మంచి పట్టున్న నేతలు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంపీగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మునుగోడు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉంటూనే.. ఆ పార్టీ పరిస్థితిపై రాజగోపాల్‌ రెడ్డి గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ వ్యాఖ్యానించి చర్చకు తెరలేపారు. అంతకు ముందు నుంచే ఆయన బీజేపీలోచేరాతారనే ప్రచారం సాగింది. ఈశాన్య రాష్ట్రాలలో కాంట్రాక్ట్‌ పనులు చేస్తుండడం, బీజేపీ నేతలతో మంచి సంబంధాలు ఉండడంతో రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మార్పు ప్రచారానికి బలం చేకూరింది. అయితే ఆయన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. పార్టీ మారతారని ప్రచారం సాగినా..రాజగోపాల్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టలేదు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాల్సిందిగా.. ఆ పార్టీ నేతలు రాజగోపాల్‌ రెడ్డిని సంప్రదించారు. కారణాలు ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ పదవి దక్కలేదు. పీసీసీ రేసులో ఉన్న సమయంలో.. తెలంగాణ అంతా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని ప్రకటించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇప్పుడు భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాలకే పరిమితం అవుతానని చెప్పిన నేపథ్యంలో.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.

Also Read : రేవంత్ కు పదవి ,పార్టీకి శశిధర్ రెడ్డి గుడ్ బై?