iDreamPost
android-app
ios-app

రెండేళ్ల జీతం విరాళం ఇచ్చిన ఎంపీ..! ఇది కదా ప్రజా ప్రతినిధి విరాళం అంటే .,.!!

రెండేళ్ల జీతం విరాళం ఇచ్చిన ఎంపీ..! ఇది కదా ప్రజా ప్రతినిధి విరాళం అంటే .,.!!

తన ఎంపీ నిధుల నుంచి కరోనా పోరుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన ఎంపీ. ఎంపీ ఫండ్‌ను రెండు కోట్ల విరాళం ఇచ్చిన ఎంపీ.. ఇదీ ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలు. ప్రతి ఎంపీకి ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు తన నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. వాటిలోని నిధులు తీసి కరోనా పై పోరు కోసం తిరిగి ప్రభుత్వానికే ఇచ్చిన ఎంపీలను ఇప్పటి వరకూ చూశాం. తమ జేబులో నుంచి రూపాయలు ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్మును తిరిగి ప్రభుత్వానికే విరాళం ఇచ్చిన ఎంపీలకు భిన్నంగా ఓ ఎంపీ తన రెండేళ్ల జీతాన్ని పీఎం కేర్స్‌కు విరాళం ఇచ్చారు.

భారత క్రికెట్‌ జట్టు మాజీ క్రికెటర్, ఒకప్పటి ఓపెనర్, ప్రస్తుతం ఎంపీ(లోక్‌సభ) గౌతమ్‌ గంభీర్‌ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎంపీగా తనకు వచ్చే జీతాన్ని కరోనాపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి విరాళంగా ఇచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. గత ఎన్నికల్లో గౌతమ్‌ గంభీర్‌ బీజేపీ తరఫున ఢిల్లీ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.

‘‘మనకు దేశం ఏం చేసిందని అందరూ ప్రశ్నిస్తుంటారు. కానీ మనం దేశానికి ఏం చేశామన్నది నిజమైన ప్రశ్న. నా రెండు సంవత్సరాల జీతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నాను. ఈ మంచి పని కోసం మీరు ముందుకు రావాలి’’ అంటూ గంభీర్‌ ట్వీట్‌ చేశారు. గంభీర్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. తన జీతం విరాళం ఇచ్చే ముందే తన ఎంపీ ఫండ్స్‌ నుంచి కోటి రూపాయలు కరోనా నియంత్రణ కోసం ఖర్చు పెట్టేలా ప్రభుత్వానికి అనుమతి పత్రాలు ఇచ్చారు.

గంభీర్‌తోపాటు ఇప్పటికే పలువురు క్రీడాకారులు కరోనా మహమ్మరిపై పోరాటానికి తమ వంతు మద్ధతును తెలియజేశారు. తమకు తోచిన విధంగా విరాళం ఇచ్చారు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్, సురేష్‌ రైనా, విరాట్‌ కోహ్లీ, ఎం.ఎస్‌.ధోని, రోహిత్‌ శర్మ, పీవీ సింధు, మేరికోమ్‌ తదితరులు పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళాలు అందించారు.