iDreamPost
android-app
ios-app

సీఎంను మరోసారి కలవనున్న చిరంజీవి

సీఎంను మరోసారి కలవనున్న చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలకు సంబంధించి సినిమా పరిశ్రమలో కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నా సరే సినీ పెద్దలు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి దీనికి సంబంధించి ఎక్కువగా చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నా సరే చిరంజీవి మాత్రం సీఎం జగన్ తో భేటీ అయి సినిమా థియేటర్ యాజమాన్యాల సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ధరలను తగ్గిస్తే వచ్చే నష్టాలను వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల… మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో సమావేశమై కొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. ఆ తర్వాత టికెట్ ధర లకు సంబంధించి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని అందరూ భావించినా సరే అది ఒక కొలిక్కి రాలేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా కొంతమంది విమర్శలకు దిగడం విమర్శల పాలవుతోంది. రాష్ట్రప్రభుత్వం సామాన్యుడికి సినిమాలు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతోంది. కొంతమంది అనవసరంగా వివాదాలకు ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఈనెల పదో తారీఖున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మరోసారి కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. చిరంజీవితో పాటు ముగ్గురు నిర్మాతలు కలిసే అవకాశం ఉందని అల్లు అరవింద్, దిల్ రాజు అలాగే మరో నిర్మాత కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు టాలీవుడ్ హీరోలు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధర లకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు కూడా విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను సమర్ధించారు.