టికెట్ ధర పెంపు మరియు అదనపు షోలకు అనుమతుల విషయం మీద కొంత సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం నాడు టికెట్ రేట్లను నిర్ధారించే జీవో 35ను హైకోర్టు రద్దు చేసిన క్రమంలో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు ఏపీ ప్రభుత్వం వెళ్లింది. జీవో 35ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.
టికెట్ ధరల పై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ లకు లైసెన్స్ లు ఉన్నాయో లేదో చెక్ చేయాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి సినిమా హాలు యొక్క బి ఫారమ్‌లను ధృవీకరించాలని తహశీల్దార్ కార్యాలయాలను ఆదేశించింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లోని సగానికి పైగా సినిమా థియేటర్‌లకు అవసరమైన బి ఫారమ్‌లు లేకపోవచ్చని భావిస్తున్నారు, వాటిని ప్రభుత్వం ధృవీకరించమని కోరింది. బి ఫారమ్‌ను అందించడంలో విఫలమైతే థియేటర్‌లను సీజ్ చేయడంతోపాటు తదుపరి చర్యలకు కూడా ఆదేశించే అవకాశాలు కనబడుతున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం సినిమా థియేటర్ నిర్వాహకులు ఇప్పుడు బి ఫారమ్‌లతో సిద్ధంగా ఉండాలన్నమాట. బీ ఫారమ్ లతో పాటు థియేటర్స్ లో అన్ని సదుపాయాలను చెక్ చేయనున్నారు.
Also Read : సినిమా టిక్కెట్లపై మధ్యేమార్గం.. హైకోర్టు కీలక ఆదేశాలు