iDreamPost
android-app
ios-app

జగన్‌ సర్కార్‌ ఒక నిర్ణయం.. రెండు లాభాలు..

జగన్‌ సర్కార్‌ ఒక నిర్ణయం.. రెండు లాభాలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అవసరమైన విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ సర్కార్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతులకు మేలు చేసేలా వైఎస్సార్‌ రైతు భరోసా, పంట బీమా, వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుతో సరసమైన ధరలకు విత్తనాలు, ఎరువులు, పరుగు మందులు సరఫరా చేస్తుండగా.. ఇకపై గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోసించే పాడి పరిశ్రమపై జగన్‌ సర్కార్‌ దృష్టి పెట్టింది. రైతులకు వ్యవసాయం, పాడి రెండు కళ్లులాంటివి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ రెండు జోడు చక్రాలు. ఒక వేళ ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పాడి పశువుల రూపంలో ఆసరా దొరుకుతుంది. ఇంతటి కీలకమైన రంగంలో సమూల మార్పులు తెచ్చేలా.. సహకార పాడి రంగాన్ని బలోపేతం చేసేందుకు వైసీపీ సర్కార్‌ ఈ రోజు దేశంలోనే డైరీ పరిశ్రమలో ప్రఖ్యాతిగాంచిన అమూల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఏపీలో జిల్లాల వారీగా సహకార డైరీలు ఉన్నాయి. అయితే ప్రైవేటు కంపెనీలతో పోటీ పడలేక చాలా జిల్లాల డైరీలు నష్టాలతో నడుస్తున్నాయి. పాల సేకరణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోలేక వెనకబడుతున్నాయి. ఈ సమస్యకు అమూల్‌తో ఒప్పందం పరిష్కారం చూపెడుతుంది. ఏపీలోని వివిధ జిల్లాల సహకార డైరీలు సేకరించిన పాలను అమూల్‌ మార్కెటింగ్‌ చేయనుంది. పాల ఉత్పత్తులను విరివిగా తయారు చేసే అమూల్‌కు దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉంది. ఇది ఏపీలోని పాడిరైతులకు, సహకార సంఘాలు, డైరీలకు ఉపయోగపడనుంది.

సహకార సంఘాలకు పాలుపోసే రైతులకు లీటర్‌కు అదనంగా నాలుగురూపాయలు ఇస్తామని సీఎం జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమూల్‌తో ఒప్పందం జరగడంతో సహకార డైరీ ఉద్యోగులు పాల సేకరణపై దృష్టి పెట్టనున్నారు. గతంలో ప్రతి గ్రామంలో ఉన్న పాల ఏజెంట్లను తిరిగి పునరుద్ధరించడంపై దృష్టి పెట్టారు. ఒకట్రెండు నెలల్లో వ్యవస్థ తిరిగి గాడిలో పడితే సహాకార డైరీలకు పూర్వవైభవం రానుంది. ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన ఒంగోలు డైరీ, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి ధవళేశ్వరంలో ఉన్న గోదావరి డైరీ సహా పలు సహకార డైరీలకు మంచి రోజులు రానున్నాయి. ఏపీ ప్రభుత్వం ఒప్పందం కారణంగా పాడి రైతులకు, సహకార డైరీల ఉద్యోగులకు మేలు జరగనుంది.