Idream media
Idream media
మోత్కుపల్లి నర్సింహులు ఒకప్పుడు మామాలు నేత కాదు.. తెలంగాణలో మోస్ట్ సీనియర్. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పని చేశారు. ఫైర్ బ్రాండ్ నేతగా కూడా పేరు ఉండేది. అయితే, టీడీపీలో ఉండగా గవర్నర్ ను చేస్తానని హామీ ఇచ్చి ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన షాక్ తో ఆయనపై వింత విమర్శలు మొదలయ్యాయి. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లినా ఎవరికీ కాకుండా నిలిచిపోయారు. అందుకనే సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కేసీఆర్ దళిత బంధు పుణ్యమా అని మోత్కుపల్లికి మళ్లీ ఓ చాన్స్ ఇచ్చింది. అధికారికంగా టీఆర్ఎస్ లో ఇంకా చేరకపోయినప్పటికీ, ఓ పదవి అయితే ఆయన కోసం క్రియేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆయన కూడా కేసీఆర్ పై విధేయత ప్రదర్శించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు.
మోత్కుపల్లిది మొదటి నుండి విచిత్రమైన వ్యవహార శైలి. ఏ పార్టీలో ఉన్నా, విషయం ఏదైనా తన మాటే చెల్లుబాటు కావాలనే పంతం ఎక్కువ. ఎన్టీయార్ పిలుపుతో నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లోకి దూకారు. చిన్న వయస్సులోనే ఎంఎల్ఏగా గెలవటమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. అయితే ఎన్టీయార్ తో పడని కారణంగా పార్టీకి దూరమయ్యారు. మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. 1999లో కాంగ్రెస్ తరపున గెలిచినా చంద్రబాబునాయుడు పిలుపుతో టీడీపీలోకి దూకేశారు. అప్పటి నుండి 2017 వరకు టీడీపీలో తన హవా బాగానే నడిచింది. చాలా మంది నేతలకు లాగే రాష్ట్ర విభజన ప్రభావం ఈయన పైన కూడా పడింది. ఎప్పుడైతే తెలంగాణా టీడీపీకి క్షీణ దశ మొదలైందో మోత్కుపల్లికి కూడా డౌన్ ఫాల్ స్టార్టయ్యింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోత్కుపల్లికి చాలా మంది నేతలతో పడదు. ఎందుకంటే తనమాటే చెల్లుబాటవ్వాలనే మనస్తత్వం వల్లే తరచు ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుండి టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ నానా రచ్చ చేశారు. ఈయన గోలను భరించలేక చివరకు చంద్రబాబు పార్టీ నుండే బహిష్కరించారు. టీడీపీలో ఉండి టీఆర్ఎస్ కు వత్తాసుగా మాట్లాడిన కారణంగా తనను కేసీయార్ అక్కున చేర్చుకుంటారని ఆశించిన మోత్కుపల్లికి నిరాశే ఎదురైంది. తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ నేత బీజేపీలో చేరారు. అయితే కమలంపార్టీలో కూడా ఈయనను ఎవరు పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో తోచక చివరకు రాజీనామా చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు దోచుకోవాలన్న పట్టుదలతో ఉన్న సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాజాగా సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ కలల పంట అయిన దళిత బంధు పథకాన్ని నూటికి నూరు శాతం అమలు చేయటం ఖాయమని.. కేసీఆర్ మీద తనకున్న నమ్మకాన్ని చెప్పుకొచ్చారు. ఆ మాటలకు అంత ఎఫెక్టు ఉండదని అనుకున్నారో ఏమో కానీ.. గులాబీ నేతల నోటి నుంచి సైతం రాని మాటల్ని తాజాగా చెప్పుకొచ్చారు. దళితబంధు పథకాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తారని.. కేసీఆర్ మాటల్లో నిజాయితీ కనిపించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్లే చేస్తారన్న నమ్మకం తనకుందన్న ఆయన.. ఒకవేళ ఆయన చెప్పినట్లుగా దళితబంధు నూటికి నూరుశాతం అమలు కాకుంటే తాను పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండ మీద సూసైడ్ చేసుకుంటానని అదిరే ప్రకటన చేశారు.
కేసీఆర్ మీద అచంచల నమ్మకాన్ని ప్రదర్శించిన మోత్కుపల్లి.. తాజాగా చెలరేగిపోతూ.. గులాబీ బాస్ పై ఘాటు విమర్శలు చేస్తున్న రేవంత్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీని నిలువునా ముంచింది రేవంతేనని చెప్పిన ఆయన.. అతడి కారణంగానే చంద్రబాబు నాశనమయ్యాడన్నారు. రేవంత్ రెడ్డి జీవితం మొత్తం మోసాలు.. బ్లాక్ మొయిలింగేనని చెప్పారు. ఆర్టీఐని వాడుకుంది రేవంతేనని చెప్పిన మోత్కుపల్లి..దళితబంధు పథకాన్ని కాంగ్రెస్.. బీజేపీలు ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు.
దేశంలో మరే ప్రభుత్వం చేయని రీతిలో దళితుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని.. అదో మహోన్నత నిర్ణయంగా పేర్కొన్నారు. అంతేకాదు.. తన గొప్పతనాన్ని కూడా చెప్పుకున్నారు. ఒక పార్టీలో ఉండి.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. కేసీఆర్ తెచ్చిన దళితబంధుకు మద్దతు ఇవ్వటం సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పుకున్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడని మోత్కుపల్లి.. ఇప్పుడెందుకు పొగుడుతున్నారని ప్రశ్నిస్తున్నారని.. అయితే.. మంచి పని చేస్తే ఎవరికైనా సపోర్టు చేస్తానని దానికి కూడా ఆయన సమాధానం చెప్పేశారు.