iDreamPost
android-app
ios-app

దేశంలో తొలిసారి 24 వేలకు పైగా పాజిటివ్ కేసుల నమోదు

దేశంలో తొలిసారి 24 వేలకు పైగా పాజిటివ్ కేసుల నమోదు

ఒక్కరోజులో 24,018 పాజిటివ్ కేసులు – 610 మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి వేగంగా పెరుగుతోంది.గత మూడు రోజుల నుండి 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.శనివారం రికార్డు స్థాయిలో 24 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో మూడు రోజుల వ్యవధిలోనే ఆరు లక్షల నుండి ఆరు లక్షల 72 వేలకు కరోనా కేసుల సంఖ్య చేరింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,018 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,73,904 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 19,279 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 610 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 4,09,065మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 2,45,494 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు:

మహారాష్ట్రలో కరోనా బారిన పడిన వారి సంఖ్య తొలిసారిగా 7 వేల మైలురాయి దాటింది.ఈ నేపథ్యంలో మహమ్మారి కోరలలో చిక్కుకున్న వారి సంఖ్య రెండు లక్షలు దాటింది.గడిచిన 24 గంటలలో కొత్తగా 7074 మంది కరోనా బారిన పడటంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,064కు చేరింది.అలాగే నిన్న ఒక్కరోజే 295 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకోవడంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 8671 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో 83,295 వైరస్ యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 1,08,082 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఆర్థిక రాజధాని ముంబైలో ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాపిస్తుండటం ఆందోళన పరుస్తుంది. ముంబయిలో ప్రస్తుతం 83,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,830 మంది మృతి చెందారు.

దేశంలో మహారాష్ట్ర తర్వాత లక్ష కేసులు దాటినా రాష్ట్రం తమిళనాడే. కరోనా కేసుల సంఖ్యలో రెండోస్థానంలో ఉన్న తమిళనాడులో శనివారం 4,280 మందికి కరోనా సోకిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,001కి చేరింది.నిన్న 65 మంది మృత్యువాత పడటంతో మహమ్మారి సోకి మరణించిన వారి సంఖ్య 1,450కి పెరిగింది.

తెలంగాణాలో 22 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,850మందికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో తెలంగాణలో 22,312 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10487 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 11537 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 288 మంది మృత్యువాత పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 765 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 17,699 మందికి కరోనా సోకగా 218 మంది మృత్యువాత పడ్డారు. 8,008 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్  అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,473 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.