Idream media
Idream media
ఆంధ్ర ప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసులకు తగ్గట్లు వైద్య సదుపాయాలను ఎప్పటికప్పుడు పెంచుతోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆక్సిజన్‌తో కూడిన 22,500 పడకలు అందుబాటులో ఉండగా.. మరో 10 వేల పడకల్ని సిద్ధం చేస్తోంది ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరాలు వెల్లడించారు. కోవిడ్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రతి రోజు కోవిడ్ పరీక్షల కోసం రూ.5 కోట్లు , క్వారంటైన్ కేంద్రాల్లో భోజనం, పారిశుధ్యం కోసం 1.5 కోట్ల వ్యయమవుతోందని వివరించారు.
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, కరోనా నోడల్ అధికారి కృష్ణబాబుతో కలిసి కోవిడ్ నియంత్రణ చర్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ మరణాలను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. మరింత మంది వైద్యుల్ని సమకూర్చేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధి బృందంతో మాట్లాడుతున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. ఎన్ని పాసిటీవ్ కేసులు వచ్చినా.. అందరికీ చికిత్స అందిస్తామన్నారు. ప్రజలు స్వీయ రక్షణ పాటించాలని సూచించారు.