iDreamPost
iDreamPost
రెండేళ్లుగా రకరకాల కారణాల వల్ల మొదలైనప్పటి నుంచి ఏదో వాయిదా పడుతూనే వస్తున్న ఆర్ఆర్ఆర్ టీజర్లతోనే వివాదాలు కొనితెచ్చుకుంది. ఇటీవలే వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం వీడియోలో హీరో పాత్ర చివర్లో ముస్లిం టోపీ ధరించడం పట్ల ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తాజాగా తెలంగాణ కరీంనగర్ ఎంపి బండి సంజయ్ భారీ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. అలాంటి సన్నివేశాలను తొలగించి మనోభావాలను గౌరవించాలని లేకపోతే విడుదలను ఆపేస్తామని బరిగెలతో కొట్టి చంపుతామని చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు సినిమా చూడకుండా కేవలం ఒక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని ఇలా నిప్పు రాజేయడం మంచిది కాదని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఇది కల్పిత కథని రాజమౌళి ముందు నుంచి చెప్తూనే వచ్చారు. అయితే చరణ్, తారక్ పాత్రలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలను పోలి ఉంటాయని పదే పదే చెప్పడంతోనే ఇలాంటి ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప యోధులు ఒకేసారి కలుసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతో అల్లుకున్న కథే తప్ప ఇది చరిత్రలో జరగలేదని స్పష్టంగా చెబుతున్నా కూడా ఈ మనోభావాల గోల ఆగడం లేదు. ఇప్పుడిది ఆర్ఆర్ఆర్ టీమ్ కి పెద్ద తలనెప్పిగా మారింది. నిమిషంన్నర వీడియోకే ఇంత రచ్చ జరిగితే రేపు రిలీజ్ టైంలో ఇంకెన్ని చిక్కులు వచ్చి పడతాయో అంతు చిక్కడం లేదు.
ఇంకా బ్యాలన్స్ ఘాన్గ్ పూర్తి స్తాయిలో మొదలుకాలేదు. రాజమౌళి ఒక్కొక్కటిగా చక్కబెడుతున్నారు. వచ్చే నెల నుంచి హీరోయిన్లు అలియా భట్, ఒలీవియా మోరిస్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయిన నేపథ్యంలో అన్నీ ఒకదానికి మరొకటి ముడిపడిన సీన్లు ఉంటాయి కాబట్టి ఎవరో బెదిరించారని అంత సులభంగా మార్పులు చేయడం కుదిరదు. ముందైతే పూర్తి చేయాలి. ఆ తర్వాత అందులో అభ్యంతరమో కాదో తేల్చడానికి సెన్సార్ బోర్డు ఉంది, కోర్టులు ఉన్నాయి, ఆపై ప్రభుత్వాలు ఉన్నాయి. అంతే తప్ప నేరుగా రాజకీయ నాయకులే ఇలా చంపుతామని బెదిరిస్తే సినిమాలు తీయడం మానుకోవాలా అంటూ ఇండస్ట్రీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఈ పరిణామాలు ఎక్కడి దాకా వెళ్తాయో