iDreamPost
android-app
ios-app

దేశం మూడ్‌ ఎలా ఉంది..? సీ ఓటర్‌ – ఇండియా టుడే సర్వే ఏం చెబుతోంది..?

దేశం మూడ్‌ ఎలా ఉంది..? సీ ఓటర్‌ – ఇండియా టుడే సర్వే ఏం చెబుతోంది..?

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా రెండు పర్యాయాలు ప్రధానిగా ఎన్నికై, 8 ఏళ్లుగా పాలిస్తున్న మోడీపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదని సీ ఓటర్‌ –ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే ద్వారా వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీఏ కూటమినే అధికారంలోకి వస్తుందని సదరు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేదని తెలియజేస్తోంది. 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీఏ కూటమికి 296 స్థానాలు వస్తాయని సర్వే తెలుపుతోంది. గత ఎన్నికల్లో ఈ సీట్ల సంఖ్య 350 కాగా.. ఆ సంఖ్య ప్రస్తుతం కొంత మేర తగ్గింది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా.. ఇప్పుడు 271 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. మొత్తంగా బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని సీ ఓటర్‌ – ఇండియా టుడే సర్వే వెల్లడిస్తోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 127 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఇందులో కాంగ్రెస్‌ సొంతగా 61 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 52 సీట్లు గెలుచుకుంది. ఈ గణాంకాలు చూస్తే.. కాంగ్రెస్‌ పరిస్థితి ఏ మాత్రం మారలేదని తెలుస్తోంది. యూపీఏ, ఎన్డీయేతర పార్టీలు 120 సీట్లు గెలుచుకుంటాయని సర్వే చెబుతోంది.

మోడీ మానియా…

గడిచిన మూడేళ్లలో దేశంలో పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. కరోనా వైరస్‌ వల్ల దేశం అతలాకుతలమైపోతోంది. కరోనా సమయంలో పేదలకు బియ్యం పంపిణీ తప్పా.. మరెలాంటి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా అందించిన సందర్భం లేదు. గ్యాస్, పెట్రోల్‌ ధరలు భారీగా పెరిగాయి. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ పరం చేసే చట్టాలను వెనక్కి తీసుకున్నా.. రైతుల్లో భయం మాత్రం ఇంకా తగ్గలేదు. ఏడు దశాబ్దాలుగా స్థాపించుకుంటూ వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్‌ అమ్మేస్తోంది. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న బడాబాబులు విదేశాలకు పారిపోతున్నారు. మరికొంత మంది బీజేపీ తీర్థం పుచ్చుకుని తప్పించుకుంటున్నారు. అయినా కూడా బీజేపీకే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మోడీయేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మోడీపై అవినీతి ఆరోపణలు రాకపోవడంతోనే ఆయనపై ప్రజల్లో ఆదరణ తగ్గడం లేదని తెలుస్తోంది.

Also Read : ఐదు రాష్ట్రాల ఎన్నికలు : బీజేపీ జాబితాల్లో ట్విస్టులు