iDreamPost
android-app
ios-app

వైరల్ వీడియో: అధికారిలా ఫైళ్లను పరిశీలిస్తున్న కోతి

వైరల్ వీడియో: అధికారిలా ఫైళ్లను పరిశీలిస్తున్న కోతి

ఎవరైనా అల్లరి పనులు చేస్తుంటే ఏంటా కోతి వేషాలు అంటూ నిందిస్తుంటారు. ఎవరిమీదనైనా కోపం ప్రదర్శిస్తే.. ఏంటీ కళ్లు తాగిన కోతిలాగా ఆ చిందులు అంటుంటారు. అలాగే ఇంటికి అమ్మనాన్నలకు నచ్చని ఫ్రెండ్ వస్తే.. తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని దెప్పుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే వానర జాతి మీద లెక్కలేనన్నీ జాతీయాలు, సామెతలు.. మానవుల జీవితాలతో ముడిపడిపోయి ఉన్నాయి. ఎంతైనా మనం ఆ జాతి నుండి వచ్చిన వాళ్లమే కదా.. ఎక్కడికి పోతాయి ఆ బుద్దులు చెప్పండి మరీ. ఇదంతా సరే ఎందుకీ కోతి పురాణం అని అనుకుంటున్నారేమో.. అవును మరీ ఇప్పుడు మన న్యూస్‌లోకి ఓ వానరం వచ్చి చేరింది. నెట్టింటిని షేక్ చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ లోని ఓ వానరం ఆఫీసులోని ఫైళ్లను అటు ఇటు తిప్పుతూ.. మనిషిలా ప్రవర్తిస్తోంది. టేబుల్ మీద ఎంచక్కా కూర్చుని పేపర్లను అటు ఇటు తిరగేస్తోంది. ఏం చదివేస్తుందో తెలియదు కానీ.. ఓ అధికారిలాగానే పని చేసేస్తోంది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. అందులో వానరానికి అరటిపండు లంచంగా ఇవ్వడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తొలుత ఈ వీడియో సహరన్ పూర్ లోని బెహత్ తాశీల్దారు కార్యాలయంలోని రిజిస్టార్ టేబుల్ వద్ద కోతి ఇలా ప్రవర్తించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ఘటన తాశీల్దార్ కార్యాలయంలోని కాదని పేర్కొన్నారు.

అది ఓ న్యాయవాది ఛాంబర్ అని వెల్లడించారు అధికారులు. ఛాంబర్‌లోకి ప్రవేశించి వానరం ఇతర ఉద్యోగులను కూడా పట్టించుకోకుండా.. దర్జాగా టేబుల్ పై కూర్చుని ఫైళ్లను తిరగేసేస్తుంది. ఒక దాని తర్వాత ఒకటి తిప్పేస్తూ కనిపిస్తోంది. న్యాయవాది ఏ కేసు గురించి పరిశీలించమన్నాడేమోనన్నట్లుగా ప్రవర్తించింది ఆ వీడియోలో. కాగా, ఆ కార్యాలయంలో ఉన్న జనాలు.. కోతి చర్యలను చూసి ఏమీ చేయకుండా.. వీడియో తీసి వైరల్ చేశారు. అనంతరం అటవీ శాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు.