P Krishna
P Krishna
దేశం వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉండబోతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమలవుతుంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యిందో లేదో.. ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాల్లో పడ్డారు కొంతమంది పార్టీ నేతలు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి భారీగా నగదు, మద్యం, బంగారు, వెండి ఆభరణాలు, చీరలు దిగుమతి అవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలు అయిన వెంటనే పోలీసులు గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో భారీగా నగదు, వస్తువులు, చీరలు పట్టుబడుతున్నాయి. సరైన పత్రాలు సమర్పించని వాటిని సీజ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎవరైనా ప్రయాణాల్లో రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బుతో పట్టుబడితే సరైన పత్రాలు సమర్పించాలి.. లేని యెడల వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ ఎత్తున నగదు, అభరణాలు, కానుకలు, మాదక ద్రవ్యాలు, మద్యం రూపంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు కొంతమంది రాజకీయ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నారని.. వాటన్నింటికి చెక్ పెడుతూ స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తున్నామని పోలీస్ అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో కార్లు మొదలుకొని ఆర్టీసీ బస్సులు, బైకులు ఇతర వాహనాలు అనుమానం వస్తే ఆపి చెక్ చేస్తున్నారు పోలీసులు. 2018 ఎన్నికల తర్వాత వచ్చిన గణాంకాల ప్రకారం పట్టుబడ్డ డబ్బు, మద్యం, వస్తువుల విలువు దాదాపు రూ.137 కోట్లు అయితే.. ఇప్పుడు కేవలం పది రోజుల్లో ఆ లెక్క దాటిపోయింది. ఇప్పటి వరకు రూ.167 కోట్లు పట్టుబడినట్లు సమాచారం. ఇందులో పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి తెలంగాణకు తరలి వస్తున్న డబ్బు ఎక్కువగా ఉండటం గమనార్హం.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు భారీగానే సమర్పించుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్ అవుతున్నారు. తాజాగా కోట్ల విలువు చేసే పట్టు చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటికి పైగా ఉండవొచ్చని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లి ప్రగతినగర్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పంచవటి అపార్ట్ మెంట్ లో దాడి చేయగా పెద్ద ఎత్తన చీరలు పట్టుబడ్డాయి. ఏకంగా రెండు లారీల పట్టు చీరల లోడ్ అపార్ట్ మెంట్ లో డంప్ చేస్తుండగా పోలీసులు సమాచారం అందడంతో అక్కడి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల జరిపిన తనిఖీల్లో మిక్సీలు, రైస్ కుక్కర్లు, క్రికెట్ కిట్స్, వెండి, గోల్డ్ ఆభరణాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా రానున్న రోజుల్లో తనిఖీలను ముమ్మరం చేయబోతున్నామని.. మరింత డబ్బు, ఇతర వస్తువులు పట్టుబడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.