iDreamPost
android-app
ios-app

హెరిటేజ్ ఫుడ్స్ ఎవరిది ? మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

హెరిటేజ్ ఫుడ్స్ ఎవరిది ? మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌కే కాదు.. అధినేత చంద్ర‌బాబునాయుడుకు కూడా చిక్కులు త‌ప్ప‌డం లేదు. ఫైబ‌ర్ నెట్ వంటి స్కాంల‌లో ఆయ‌న పేరు వినిపించ‌డ‌మే కాదు.. హెరిటేజ్ ఫుడ్స్ పై కూడా ఎన్నో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. తాజాగా విలక్షణ నటుడు మోహన్ బాబు అదే సంస్థ‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోహ‌న్ బాబుకు ముక్కు మీద కోపం ఉంటుందని చాలామంది అంటారు కానీ.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడినప్పుడు అలానే ఉంటుంది. మనిషి ఎంత గంభీరంగా ఉంటారో అంతే సరదాగా ఉండే వ్యక్తి మోహన్ బాబు. నటనకు సంబంధించి ఆయన్ను ఎవరూ వంక పెట్టలేరు. తాజాగా ఆయనో చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి పలు సంచలన వ్యాఖ్యలు వచ్చాయి.

హెరిటేజ్ ఫుడ్స్ అన్నంతనే చంద్రబాబు ఫ్యామిలీది గుర్తుకు వస్తుంది. కానీ.. అసలు ఆ కంపెనీ తనదేనని.. తనను చంద్రబాబు మోసం చేశారంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇష్యూ మీద మోహన్ బాబు నోట్లో నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే.. ‘‘రాజకీయంగా నా మనసును గాయపరచింది చంద్రబాబు. హెరిటేజ్ ఫుడ్స్ నాదే.. ఆ సంస్థలో నా డబ్బు నా షేర్ ఎక్కువ.. అతనిది తక్కువ. రాజశేఖర రెడ్డిగారు పాదయాత్రకి వెళ్లే ముందు మా ఇంటికి వచ్చారు. నువ్వు చంద్రబాబు ఫ్రెండ్సే కదా? ఏంటి మీ ఇద్దరికీ గొడవ? అన్నారు వైఎస్. ఆయన్ను అన్నపూర్ణ హోటల్లో నాకు పరిచయం చేసింది చంద్రబాబే. హెరిటేజ్లో నా డబ్బు ఇంత చంద్రబాబుది ఇంత వేరే వ్యక్తిది ఇంత.. ఇలా ఇలా మోసం చేశాడని చెప్పా. ‘వాళ్ల మామకే (ఎన్టీఆర్) వెన్నుపోటు పొడిచాడు.. నిన్ను మోసం చేయడంలో కొత్తేముంది?’ అన్నారు వైఎస్’’ అని వ్యాఖ్యానించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

మరి.. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నట్లు? ఇప్పుడీ విషయాన్ని ఎందుకు ప్రస్తావించినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. తనను చంద్రబాబు పార్టీ నుంచి తీసేసిన విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని.. కానీ తాను పనికిరానని అప్పటి ముఖ్యమంత్రి పార్టీ నుంచి తీసేశారంటూ చంద్రబాబు పేరు ప్రస్తావన తేకుండా.. పరోక్షంగా చెప్పటం గమనార్హం. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వెళ్లానని.. నేనెప్పుడూ ఏదీ ఆశించలేదన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ పై గ‌తంలో కూడా మోహ‌న్ బాబు ఇదే త‌రహా వ్యాఖ్య‌లు చేశారు. ఆ సంస్థ నుంచి కానీ, చంద్ర‌బాబు కానీ స్పందించ లేదు. మ‌రోసారి కూడా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కూడా ఖండించ‌కుంటే అవి నిజ‌మే అనుకోవాల‌మో..!