విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా, నటుడిగా 600కి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా నిర్మాతగానూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్‌బాబు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా శ్రీవిద్యానికేతన్ అనే విద్యాసంస్థను ప్రారంభించి, వందలాది మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. ఆ తర్వాత శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పీజీ, ఫార్మసీ కాలేజీలను ప్రారంభించారు. ఇక ఎప్పటి నుంచో తన విద్యాసంస్థలను యూనివర్సిటీగా మలచాలని ఆయన కలగన్నారు.
ఎట్టకేలకు ఆయన కల నిజమై, యూనివర్సిటీకి అనుమతులు లభించాయి. తాజాగా ‘మోహన్‌బాబు యూనివర్సిటీ’ని ప్రారంభిస్తున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు. ‘‘నా తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఫ్యాన్స్, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో ఎం.బి.యు (మోహన్‌బాబు యూనివర్సిటీ)ని స్టార్ట్ చేయబోతున్నాను. శ్రీవిద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు నేడు కల్పవృక్షంగా మారాయి. 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం నెరవేరింది. తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను అంటూ ఒక నోట్ విడుదల చేశారు ఆయన.
ఇక మోహన్ బాబు ఈ విషయాన్ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత అంటే సోమవారం పొద్దుపోయిన తర్వాత మోహన్ బాబు యూనివర్శిటీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా రంగంపేటలో ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఏపీ ప్రైవేటు యూనివర్శిటీల జాబితాలో పదో యూనివర్శిటీగా ఎంబీయూనూ చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన తన స్వీయ నిర్మాణంలో కుమారుడు విష్ణుతో కలిసి సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాను రూపొందిస్తూ అందులో హీరోగా నటిస్తున్నారు మోహన్ బాబు. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read : ప్రజలు గెలిపించారు – కుటుంబం ఓడించింది ..ఎన్టీఆర్