iDreamPost
android-app
ios-app

లక్ష్యం ఏదో గానీ.. నష్టం భారీగానే ఉంటోంది మోడీ సాబ్‌

లక్ష్యం ఏదో గానీ.. నష్టం భారీగానే ఉంటోంది మోడీ సాబ్‌

ఆంధ్రప్రదేశ్‌ విభజన అప్రజాస్వామికంగా జరిగిందంటూ ప్రధాని మోడీ ఎనిమిదేళ్ల తర్వాత ఏ లక్ష్యంతో మాట్లాడారో గానీ.. తెలంగాణలో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆ వ్యాఖ్యల తాలుకూ నష్టం భారీగా ఉంటోందని మథనపడుతూనే.. మోడీ ప్రసంగాన్ని సమర్థించేదుకు తంటాలు పడుతున్నారు. గులాబీ దళం అంతా మోడీ వ్యాఖ్యలపై విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలు మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రజల్లో రగిలిస్తాయని, అంతిమంగా అది టీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందనే ఆందోళనతో కాషాయదళం మథనపడుతోంది.

మోడీ వ్యాఖ్యలు తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారిని అగౌరవ పరిచినట్లేనని టీఆర్‌ఎస్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత మాట్లాడడం ప్రధానికి తగదని, ఆ రోజు మద్ధతు ఇచ్చి ఈ రోజు ఇలా మాట్లాడడం సరికాదని రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్‌ విమర్శలు సందించారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపినా కలుపుతారని మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలు  బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకతను పెంచేందుకు దోహదపడుతున్నాయి. ప్రధాని మోడీ పై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రివిలేజ్‌ మోషన్‌ ఇవ్వడం.. ఈ రోజు పార్లమెంట్‌ తొలివిడత సమావేశాలు బహిష్కరించడం వంటి చర్యల ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీపై ఒత్తిడి పెంచుతూ.. తెలంగాణ గురించి ఆలోచించే ఏకైక పార్టీ తమదేననే సందేశాన్ని ప్రజలకు పంపింది.

ఈ పరిణామాలు అంతిమంగా తెలంగాణలో ఎదిగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూ, లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న కమలదళానికి స్పీడ్‌ బ్రేకర్‌ లాంటివే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటునే గెలుచుకున్నా.. ఆ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంది. ఆ పార్టీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించి.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో బీజేపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ తరుణంలో మోడీ రాష్ట్ర విభజన పై చేసిన వ్యాఖ్యలు బీజేపీకి తీరని నష్టం చేకూర్చేలా ఉన్నాయనే భావన తెలంగాణ కమలం నేతల్లోనూ నెలకొంది.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్‌ అక్కడ గెలవలేకపోయిందని కూడా మోడీ అనడం.. కాంగ్రెస్‌ పార్టీ నెత్తిన పాలుపోసినట్లుయింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని, అయినా ఆ పార్టీని గెలిపించలేక పోయారంటూ పరోక్షంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పినట్లుగా ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఎటు చూసినా మోడీ వ్యాఖ్యల వల్ల తెలంగాణలో బీజేపీకి నష్టమే జరుగుతోంది. మరి ఈ పరిణామాల నుంచి తెలంగాణ బీజేపీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

Also Read : ఏపీ విభ‌జ‌న స‌రిగా జ‌ర‌గ‌కే ఈ ప‌రిస్థితులు : ప్రధాని మోడీ కీల‌క వ్యాఖ్య‌లు