Idream media
Idream media
ట్విటర్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయర్లు ఉన్న క్రియాశీలక రాజకీయవేత్త (యాక్టివ్ పొలిటిషియన్)గా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఇప్పటిదాకా ఈ రికార్డు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట ఉండేది. అయితే ట్రంప్‌నకు చెందిన వందల మంది ఫాలోయర్లు శుక్రవారం వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై ముట్టడి చేసిన అనంతరం ట్రంప్ ఖాతాను ట్విటర్ శాశ్వతంగా రద్దు చేసింది. ట్రంప్ ట్విటర్ ఖాతాకు 8.87 కోట్ల మంది ఫాలోయర్లు ఉండేవారు. మోదీకి ప్రస్తుతం 6.47కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే ట్విటర్‌లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న రాజకీయవేత్తగా మాత్రం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే కొనసాగుతున్నారు. ఆయన ఖాతాను 12.79కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జొ బైడెన్ ట్విటర్ ఖాతాను 2.33 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. కాగా ట్రంప్ ఖాతాను ట్విటర్ పూర్తిగా తొలగించడాన్ని బీజేపీ విమర్శిస్తే, కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నియంత్రణలేని బడా సంస్థలతో మన ప్రజాస్వామ్యానికి ఎంత ముప్పు పొంచివుందేనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నవారికి ఇది మేలుకొలుపు అని బీజేవైం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య అన్నారు. అమెరికా అధ్యక్షుడి ఖాతానే తొలగించేస్తే.. వారు ఎవ్వరి విషయంలోనైనా ఈ చర్య చేపట్టవచ్చునంటూ ట్వీట్ చేశారు. కాగా భావప్రకటనా స్వేచ్ఛ నెపంతో వాచాలత ద్వారా పూర్తి సమాజాన్ని ప్రమాదంలో పడేయకూడదు అని ఈ ఘటన సూచిస్తుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన డాటా ఎనలిస్ట్, న్యాయవాది ప్రవీణ్ చక్రవర్తి పేర్కొన్నారు.