iDreamPost
iDreamPost
విపక్ష సీఎంలు మాత్రమే కాదు..మిత్రపక్ష , చివరకు స్వపక్ష సీఎంలు కూడా కోరినప్పటికీ ప్రధాని మోడీ స్పందించలేదు. కరోనా సమయంలో అందించాల్సిన సహాయం గురించి నోరు విప్పలేదు. ఏకంగా లక్ష కోట్లు తక్షణమే ఇవ్వాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేడుకున్నప్పటికీ పట్టించుకున్నట్టు కనిపించలేదు. దాంతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ మరోసారి సీఎంలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పవచ్చు. కేవలం లాక్ డౌన్, ఫలితాలు, సడలింపునకు సంబంధించిన సూచనలు మాత్రమే పరిగణలోకి తీసుకున్న ప్రధాని మోడీ, ఆమేరకు మాత్రమే సమాధానం ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం దాపురిస్తోంది.
తెలంగాణాలో తొలి 20 రోజుల్లో ప్రభుత్వానికి 7 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంటే కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఏపీలో కూడా దాదాపుగా అంతే. చివరకు ఏపీ ప్రభుత్వం ఈనెల ఇంకా ముగియకుండానే రూ.4వేల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులతోనే సిబ్బంది వేతనాలు సహా అనేక చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. లాక్ డౌన్ మూలంగా మొత్తం వ్యవస్త స్తంభించడంతో కార్యకలాపాలు నిలిచిపోయి కాసులు సంపాదించే మార్గాలు నిలిచిపోయాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీస్తోంది. దాంతో తమను ఆదుకోవాలని వివిధ ప్రభుత్వాలు కోరుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఖాళీ ఖజానాల కోసం బ్లాక్ గ్రాంట్ కింద రూ. లక్ష కోట్లు ఇవ్వాలని కోరారు. ఆర్బీఐ అందిస్తున్న నిధులపై వడ్డీలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఎఫ్ ఆర్ ఎం బీ చట్టాన్ని సవరించి 3 శాతం నుంచి 5 శాతం వరకూ అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆశించారు. 5నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న జీఎస్టీ బకాయిలు వెంటనే రాష్ట్రాలకు ఇవ్వాలని కోరారు. ఆరు నెలల పాటు అప్పుల చెల్లింపు వాయిదా వేయాలని కోరుతున్నారు.
ఇలాంటి పలు అంశాలను ముఖ్యమంత్రులు వివిధ స్థాయిల్లో పీఎం ముందు ప్రస్తావించారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న ముఖ్యమంత్రులు కొందరు పదే పదే ఈ విషయాలను పీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయినా మోడీ మాత్రం స్పందించలేదు. ఇప్పటికే గత రెండు వీడియో కాన్ఫరెన్సులలో కూడా ఇలాంటి డిమాండ్లు వచ్చాయి. ఏపీ సీఎం జగన్ కూడా గత సమావేశంలో ప్రధానిని ప్యాకేజీ కోరారు. కానీ స్పందన రాకపోవడంతో ఈసారి ఆయన పెద్ద గా ప్రస్తావించలేదు. కానీ బీహార్, పాండిచ్చేరి, రాజస్తాన్, ఉత్తరాఖండ్ , పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ విషయంపై మాట్లాడారు. అయితే ప్రధాని వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడకపోయినప్పటికీ ఆ తర్వాత స్పందించే అవకాశం లేకపోలేదని కొందరు ఆశిస్తున్నారు. ఇప్పటి వరకూ రెండోవిడత లాక్ డౌన్ ముగింపు దశకు వస్తున్నా కేంద్రం కనికరం చూపడం లేదనే కారణంతో కేరళ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికయినా కేంద్రం తగిన రీతిలో నిధుల కేటాయింపు విషయంలో ఉదారంగా వ్యవహరించకపోతే పలు ప్రభుత్వాలు కూడా అదే దారిలో వెళ్లక తప్పదనే వారు కూడా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేందుకు కేంద్రం ఏస్థాయిలో ముందుకొస్తుందో చూడాలి.