Idream media
Idream media
మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయన ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో జో బైడెన్ తో ప్రాంతీయంగా అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ జపాన్ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్ సదస్సులో నేడు పాల్గొననున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యాచరణ ప్రాధాన్యాలను గుర్తించడానికి ఈ సదస్సు దోహదపడుతుంది అని పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
క్వాడ్ అంటే..
క్వాడిలేటరలర్ సెక్యూరిటీ డైలాగ్.. అదే క్వాడ్. అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజనాలు కాపాడుకుంటూ భద్రతలో ఒకరికొకరు సహకరించుకునేలా చేయడమే క్వాడ్ లక్ష్యం. 2004లో సునామీ అల్లకల్లోలం తర్వాత విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి ఏర్పడిన ఈ కూటమి 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబె చొరవతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనే లక్ష్యంగా రూపాంతరం చెందింది. ఇప్పటివరకు క్వాడ్ సమావేశాలు విదేశాంగ మంత్రులు, దౌత్య ప్రతినిధుల మధ్య మాత్రమే జరిగాయి.
Also Read:అలా చేస్తే ఇరకాటంలో పడేది టీడీపీనే..!
ఈ ఏడాది మార్చిలో కరోనా విజృంభణ కారణంగా నాలుగు దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తొలిసారిగా ప్రత్యక్షంగా శుక్రవారం (ఈ నెల 24)న వాషింగ్టన్‌లో సమావేశమవుతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో ఈ క్వాడ్ సదస్సు ప్రత్యేకతను సంతరించుకుంది.
చైనాపైనే ప్రధాన చర్చ?
క్వాడ్ భాగస్వామ్య దేశాలకు, చైనాకు ఏదో సందర్భంలో ఎక్కడో చోట సమస్యలు ఎదురవుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మేలో చైనా బలగాలు భారత్ సైనికులపై దాడి చేసిన తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఆర్థికంగా, మిలటరీ శక్తితో భారత్‌కు చైనా సవాళ్లు విసురుతోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచింది. కరోనా సంక్షోభం సమయంలో ట్రంప్ దానిని చైనా వైరస్ అనడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇక దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం, సెంకకు, డయోయూ దీవులపై డ్రాగన్ దేశానికున్న ఆసక్తి జపాన్‌కు ప్రమాదకరంగా మారింది.
Also Read:దేవాదాయశాఖను రద్దు చేస్తామంటున్న సోము వీర్రాజు
కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకైందన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆ్రస్టేలియా డిమాండ్ చేయడంతో చైనా ఆ దేశంపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు దేశాల కూటమి కలిసి చర్చించుకోవడం చైనాను కలవరానికి గురి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు పెరిగిపోతున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెలకొల్పడానికి అనుసరించాల్సిన విధానాలపై సదస్సులో చర్చ జరగనుంది.