Idream media
Idream media
‘‘నేను ప్రధానిని కాగానే మణిపూర్, ఈశాన్యం ముంగిటికి కేంద్రప్రభుత్వాన్ని తీసుకొచ్చాను. ఈ ప్రాంతం ఇక మీదట దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ‘‘మా ప్రభుత్వం చారిత్రక శాంతి ఒప్పందాలను చేసుకుంది. మణిపూర్, ఈశాన్యం అంటే ఒకప్పుడు ప్రగతికి అడ్డుగోడలని భావించేవారు. అయితే ఇప్పుడు ఇవి దేశప్రగతికి మార్గాలు కానున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖద్వారాలు కానున్నాయి’’ అని వివరించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అప్పుడన్నీ కుట్రలే..
మణిపూర్, ఈశాన్య భారతాన్ని ఇంతకుముందున్న కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, ఇప్పుడు కేంద్రం, మణిపూర్‌లోని బీజేపీ సర్కార్లు రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి వెల్లివిరిసేలా చేశాయని చెప్పారు. ‘‘పర్వతాలు- లోయలు అంటూ అగాధం సృష్టించేందుకు కేంద్రంలోని గత ప్రభుత్వాలు కుట్రలు పన్నాయి. ఇప్పుడు ఇక్కడ తీవ్రవాదం లేదు. విధ్వంసాలు లేవు’’ అని ఆయన అన్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు మణిపూర్, ఇతర ఈశాన్యరాష్ట్రాలను తమకు పావులుగా వాడుకున్నాయని చెప్పారు. దానివల్ల ఇక్కడి ప్రజలు ప్రధాన స్రవంతికి దూరమయ్యారని తెలిపారు. అయితే తాను ప్రధానిగా ఎన్నికైన తర్వాత.. ‘‘ఈ అంతరాలు తగ్గించేందుకు’’ తీవ్రంగా ప్రయత్నించినట్టు చెప్పారు.
ఎన్నికలప్పుడే తూర్పు వైపు..
‘‘తూర్పు వైపు చూడొద్దన్నది అంతకుముందు ప్రభుత్వాల విధానం. ఎన్నికలప్పుడు మాత్రం అవి ‘తూర్పు’ వైపు చూసేవి. అయితే ‘తూర్పు’ వైపు దృష్టి పెట్టాలన్నది మా విధానం’’ అని ఆయన తెలిపారు. ‘‘బిరెన్ సింగ్ నేతృత్వంలో మణిపూర్‌లో సుస్థిరమైన సర్కార్ ఉంది. ఈశాన్యానికి చెందిన ఐదుగురు మంత్రులు కేంద్రంలో కీలకశాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
Also Read : జగన్ ఢిల్లీ టూర్.. కేంద్రం మదిలో ఏముంది?