Idream media
Idream media
2014 నుంచి 2021 ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పూర్తి చేసుకున్న పదవీ కాలం. ఈ ఏడేళ్ల తన పదవీ కాలంపై మోదీ తాజాగా ప్రసంగించారు. 2014 మే 26న భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన ఇప్పటి వరకూ తీసుకున్న సంచలన నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు.
ప్రతిపక్షాల కుట్రలు, వారికి తగిన బుద్ధి ఎలా చెప్పారో మోదీ వివరించారు. ఏడేళ్ల పాలనలో దేశం గర్వించదగిన ఎన్నో విజయాలు సాధించామని ప్రధాని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2014 నుంచి దేశం గర్వించే 00ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. వాటిలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం అత్యంత తీవ్రమైనదన్నారు. సమష్టిగా, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా, అందరి విశ్వాసాన్ని చూరగొంటూ పాలన సాగించామన్నారు.
దశాబ్దాల తరబడి సాగుతున్న సమస్యలను కూడా శాంతియుతంగా పరిష్కరించినట్లు మోదీ చెప్పుకున్నారు. ఈ ఏడేళ్ల పాలనలో ఈశాన్యం నుంచి కశ్మీరం దాకా ప్రజల్లో శాంతి, పురోగతితో కూడిన విశ్వాసాన్ని పెంపొందించడంలో విజయవంతమయ్యామని అన్నారు. ప్రధానంగా గత 21 నెలల్లో 15 నెలలు ఒకవైపు కరోనాతో పోరాడుతూ మరోవైపు 4.5 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. రికార్డుస్థాయిలో గ్రామాలకు విద్య, వైద్యం, రహదారి, విద్యుత్, బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించామని వివరించారు.
కరోనా కారణంగా వేలాది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం భారీగా దెబ్బతీసింది. అయినప్పటికీ సమష్టిగా పోరాడి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటున్నామో వివరించారు. ‘సబ్ కాసాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ తాము పాటించే మంత్రమని గుర్తు చేశారు. ‘దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడనప్పుడు, మన భద్రతా బలగాల శక్తి సామర్థ్యాలు పెరిగినప్పుడు.. సరైన మార్గంలోనే వెళ్తున్నాం అనిపిస్తూ ఉంటుంది’ అన్నారు.
ఏడేళ్ల పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ‘వికాస యాత్ర’ పేరుతో ఒక ప్రకటనను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకటనను ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. తమ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేది సేవాస్ఫూర్తి మాత్రమేనని అందులో పేర్కొన్నారు. కరోనా గడ్డుకాలంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించినా, రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి సేకరించినా, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించినా.. అన్నిటికీ ఆ సేవాస్ఫూర్తే కారణమన్నారు.
ప్రధాని మోదీ ఏడేళ్ల పాలనలో భాగంగా సాగిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం మామిడి ప్రస్తావన కూడా వచ్చింది. కిసాన్ రైలు ద్వారా విజయనగరం నుంచి ఢిల్లీకి మామిడి వస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. దీని వల్ల ఉత్తరాది వారికి విజయనగరం మామిడి తినడానికి లభిస్తోం దని, విజయనగరం రైతులకు మంచి ఆదా యం వస్తోందన్నారు. కిసాన్ రైళ్లు ఇప్పటి వరకు సుమారు 2 లక్షల టన్నుల ఉత్పత్తులను రవాణా చేశాయని ప్రధాని తెలిపారు. కిసాన్ రైలు ద్వారా తక్కువ రవాణా ఖర్చులతో రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాలను దేశం నలు మూలకు పంపగలుగుతున్నారని అన్నారు