Idream media
Idream media
జూలై 19 నుంచి ఆగస్టు 13 మధ్యన పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే, అది కరోనా కేసుల పెరుగుదలపై ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కేంద్రమంత్రి వర్గంలో మార్పుచేర్పులుంటాయని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు ప్రధానమైనవి అని అంటున్నారు. యూపీ, బిహార్ లకు సంబంధించి కుల, మత, రాజకీయ సమీకరణాల ఆధారంగా కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు జరుగుతాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ఇప్పుడు బీజేపీలో ప్రాధాన్యత లభిస్తుందని అంటున్నారు. ఈ విషయంలో జ్యోతిరాధిత్య సింధియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ను కూల్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సింధియాకు ఇప్పుడు కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కబోతోందని తెలుస్తోంది.
అలాగే ఇటీవలే అస్సోంలో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి సోనోవాల్ కు కూడా కేంద్రమంత్రివర్గంలో స్థానం లభించనుందట. ఈ మేరకు ఆయనకు హామీ లభించిందట. ఇటీవలే మోడీని, హోం మంత్రి అమిత్ షాను కలిశారు సోనోవాల్. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్రంమంత్రి వర్గంలో స్థానం లభించడం లాంఛనమే అంటున్నారు. ఇక కీలకమైన మార్పులు యూపీ రాజకీయం మీదే ఆధారపడి జరగబోతున్నాయని టాక్. వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న యూపీ ఎన్నికలకు మోడీ ప్రభుత్వం చాలా కసరత్తే చేస్తోంది ఇప్పటికే. ఈ క్రమంలో అక్కడి రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేలానే ప్రధానంగా కేంద్రమంత్రి వర్గంలో మార్పు చేర్పులు జరగనున్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో మోదీ కొత్త టీమ్ ఇదే అని ఓ జాబితా మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారిలో శర్వానంద సోనోవాలా (అసోం), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), సుశీల్ మోదీ (బిహార్), అనుప్రియా పటేల్ (యూపీ), నారాయణ రాణే (మహారాష్ట్ర), హీనా గావిత్ (మహారాష్ట్ర), మనోజ్ తివారీ (ఢిల్లీ), శంతనూ ఠాకూర్ (బెంగాల్), దిలీప్ ఘోష్ (బెంగాల్), లల్లన్ సింగ్ (బిహార్), ఆర్.సీ.పీ. సింగ్ (బిహార్), జామ్‌యాంగ్ నామ్‌గ్యాల్ (లద్దాఖ్), సయ్యద్ జఫర్ ఇస్లామ్ (యూపీ), ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర), అశ్వనీ వైష్ణవ్ (రాజస్థాన్), లాకెట్ ఛటర్జీ (బెంగాల్), రాహుల్ కాస్‌వాన్ (రాజస్థాన్), సంతోశ్ కుశ్వాహ (బిహార్), సునీతా దుగ్గల్ (హర్యానా) పేర్లు మంత్రుల జాబితాలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.