iDreamPost
android-app
ios-app

పెరిగిన స్వరం : మోడీ.. పార్లమెంట్‌లో ఢీ..!

పెరిగిన స్వరం : మోడీ.. పార్లమెంట్‌లో ఢీ..!

ఎన్నికల సీజనో, శాంతం అన్నివేళలా పనికిరాదని అనుకున్నారో ఏమో కానీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందుకు పార్లమెంట్‌ వేదికైంది. అసలు కరోనా వ్యాప్తికి కారణం ఏంటో తెలుసా.. కాంగ్రెస్సే అంటూ కొత్త లాజిక్‌ తెరపైకి తెచ్చారు. వందేళ్లయినా అధికారంలోకి రాలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లకు నేనంటే ప్రాణమంటూ చలోక్తులు కూడా విసిరారు. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చేది ఆప్‌ అని సర్వేలు చెబుతున్న వేళ.. ఆ పార్టీపై కూడా మోడీ ఆరోపణలు గుప్పించారు.

కరోనా కాలంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సలహా ఇస్తే.. కాంగ్రెస్‌ నేతలు ముంబయి రైల్వేస్టేషన్‌లో కార్మికులకు టికెట్లు ఇచ్చి ఇళ్లకు వెళ్లమన్నారని, కరోనా వైరస్‌ను వ్యాప్తి చేయాలని చెప్పారని విమర్శించారు. దేశంలో కరోనా వ్యాప్తికి, వలస కార్మికుల సంక్షోభానికి ప్రతిపక్షాలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ హద్దులు మీరి వ్యవహరించిందని, కార్మికులను కష్టాల్లో ముంచిందని మండిపడ్డారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం మురికివాడలకు జీపుల్లో వెళ్లి మరీ.. ఇళ్లకు వెళ్లాలని మైకుల్లో ప్రకటనలు చేసిందని, బస్సులను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు, దీంతో అప్పటివరకు కరోనా లేని ఉత్తరప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపించిందన్నారు.

సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని దాదాపు వంద నిమిషాలపాటు మాట్లాడారు. ప్రతిపక్షాలపై, ప్రత్యేకించి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై విరుచుకుపడ్డారు. దేశాన్ని బీజేపీ విభజిస్తోందని, తమిళనాడు వంటి రాష్ట్రాలను విస్మరిస్తోందని, జన్మలో తమిళనాడును పాలించలేరంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ వ్యవహార శైలి చూస్తుంటే వందేళ్లయినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా లేదని, తాము కూడా అందుకు రంగం సిద్ధం చేశామని అన్నారు. కాంగ్రెస్‌ తమిళనాడు మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. నిజానికి దేశాన్ని విభజించి పాలించింది ఆ పార్టీయేనన్నారు. కాంగ్రెస్‌ను దేశాన్ని ముక్కలు ముక్కలు చేసే ముఠాగా అభివర్ణించారు.

గరీబీ హటావో నినాదంతో ఎన్నో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ను చివరకు పేద ప్రజలే తుడిచిపెట్టారని ప్రధాని అన్నారు. యూపీఏ హయాంలోనే ద్రవ్యోల్బణం 10 శాతం పైగా ఉందని, తాము అధికారంలోకి వచ్చాక 2014-2020 మధ్య ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తగ్గిందని తెలిపారు. ధరల పెరుగుదల కాంగ్రెస్‌ తొలి ప్రధాని నెహ్రూ కాలంలో కూడా ఉండేదన్నారు. కొరియా, అమెరికాలో జరిగిన పరిణామాలు కూడా భారత్‌లో ధరలపై ప్రభావం చూపుతాయని ఆనాడు నెహ్రూ అన్నారని గుర్తు చేశారు. రూ.15కు మినరల్‌ వాటర్‌ బాటిల్‌ కొనేవారు గోధుమలు, బియ్యం ధరలు పెరిగితే ఎందుకు భరించలేరంటూ యూపీఏ హయాంలో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇలా ఒకటేంటి ఎన్నో అంశాలపై కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. కాగా.. ప్రాణాలు కోల్పోయి, జీవనోపాధి దూరమై ప్రజలు ఎదుర్కొన్న కోవిడ్ కష్టాలను మోడీ హేళన చేశారంటూ కాంగ్రెస్‌ రివర్స్‌ అటాక్‌ చేసే ప్రయత్నం చేసింది.