Idream media
Idream media
దేశంలో విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. బీజేపీ లక్ష్యంగా కొత్త ఎత్తులు, పొత్తులపై సమాలోచనలు చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొవిడ్ రెండో దశ కట్టడిలో విఫలమైందన్న అపవాదు మూటగట్టుకుంది. కొద్ది నెలల క్రితం జరిగిన బెంగాల,తమిళనాడు.కేరళ రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ వ్యతిరేతిక పవనాలు వీచాయి. భవిష్యత్ లో బీజేపీ ఎదురీదక తప్పవన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ పరిణామాలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సైతం అనుమానాలు పెంచుతున్నాయా? లేక.. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుందని భావించి అప్రమత్తమవుతున్నారా అంటే తాజా నిర్ణయాలు అవుననే చెబుతున్నాయి.
ఫీడ్ బ్యాక్ కోసం యాప్
కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పట్టాక మరో భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అలాగే, ఇటీవల రైతుల ఖాతాల్లో భారీ ఎత్తున నగదు జమ చేసింది. వీటితో పాటు త్వరలో మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రధాని తన పాలనపైన, పార్టీపైన ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో కొవిడ్-19ను కేంద్రం ఎదుర్కొన్న స్థితి, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ తదితర అంశాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ధరల పెరుగుల, అవినీతి, శాంతిభద్రతల పరంగా వారి మనసులోని మాట ఏమిటి? ఈ అంశాలపై ఓటర్ల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇందుకుగాను ప్రత్యేక సర్వే కోసం ‘ప్రధాని నరేంద్ర మోదీ’ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్‌లో ‘షేర్ యువర్ ఆప్షన్’ను క్లిక్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు.
యూపీపైనే ప్రధాన దృష్టి
దేశంలో మోదీ నాయకత్వం, రాష్ట్ర స్థాయి సమస్యలు, స్థానిక సమస్యల్లో ఓటర్లు దేన్ని ప్రధానంగా తీసుకుంటారు? అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాల ఐక్యత, నియోజకవర్గాల పరిధిలో ఏమేరకు ప్రభావం చూపుతుంది? అనే విషయాలనూ ప్రజలను నుంచి తెలుసుకుంటారు. ఉద్యోగ కల్పన, పారిశుధ్యం, విద్యుత్తు, రోడ్లు తదితర అంశాల పరంగా ఈ సర్వేలో మొత్తం 13 అంశాలపైన ఫీడ్‌బ్యాక్ స్వీకరిస్తారు. యూపీ ఎన్నికల్లో రామ మందిర నిర్మాణం, శాంతిభద్రతల పరిరక్షణ, కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రధానాంశాలు కానున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరంగా దోహదకారి అవుతుందా? గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మెరుగుపడిందా? పనితీరు పరంగా గత ప్రభుత్వాల కంటే ఏమైనా ఆశిస్తున్నారా? ప్రజాప్రతినిధిగా అభ్యర్థిని ఎన్నుకొనే క్రమంలో దేన్ని ప్రధానంగా పరిగణిస్తారు? వంటి ప్రశ్నలూ అడగనున్నారు.
అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రశ్నలు ఉంటాయా?
యాప్ సర్వే ఫలితాలు బీజేపీ అభ్యర్థుల ఎంపికపైనా ప్రభావం చూపవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ గల బీజేపీ నేత ఎవరు? అనే ప్రశ్న ఉంటుందని, ఎమ్మెల్యేల నుంచి సీఎం అభ్యర్థి ఎంపిక సంబంధిత ప్రశ్నలు కూడా ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే, దేశ వ్యాప్తంగా కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలు, పేదలకు చేసిన లబ్ధి వంటి అంశాలు కూడా ఇందులో పేర్కొని తమకు అనుకూలంగా మార్చుకునేలా యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. అటు ప్రచారం క్పలించుకోవడంతో పాటు, ఇటు ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా వ్యూహాలు రచించుకుని రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలపడాలని మోదీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏదేమైనా మొదటి సారి ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని తెలుసుకోవడానికి ప్రధాని ప్రయత్నించడం ఆలోచించాల్సిన విషయమే.