Idream media
Idream media
తెలంగాణలో స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ముగిసింది. అన్నింటినీ అధికార పార్టీయే కైవసం చేసుకుంది. కాగా, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్ భవన్ కు ఫైలును పంపించగా.. గవర్నర్ తమిళిసై ఇందుకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై సస్పెన్స్ తొలిగినట్టైంది. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనకు గవర్నర్ తిరస్కరించారు. దీంతో ఆయనను స్థానిక కోటాలో కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు. అనంతరం గవర్నర్ కోటా నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో అభ్యర్థిని ఆమోదం కోసం పంపించారు. ఇటీవల కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కడంతో ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి అవకాశం ఇచ్చారు.
మధుసూదనచారి టీఆర్ఎష్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన మధుసూదనాచారి స్పీకర్ గా ఎన్నికై సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి మధుసూదనాచారికి ఏ పదవి దక్కలేదు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఎమ్మెల్సీగా కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మధుసూదనాచారిని శాసనమండలి చైర్మన్ గా నియమించే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసే సమయానికి మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. మరోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చారనే ప్రచార నేపథ్యంలో మండలి సారథ్యం మధుసూదనాచారికే దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి పేరు కూడా మండలి చైర్మన్ రేసులో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే రాజ్యసభకు రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన బండా ప్రకాష్ ను మండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పని చేయని ఈటల మంత్రాంగం