Idream media
Idream media
ఎమ్మెల్సీ, తూర్పుగోదావరి జిల్లా మండపేట వైసీపీ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు సేఫ్ జోన్‌లోకి వచ్చారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన పూర్తిగా కోలుకున్నారు. మునుపటి మాదిరిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయన అనుచరులు ఊపిరిపీల్చుకున్నారు. వైరస్ సోకడంతో తోట త్రిమూర్తుల ఆరోగ్యంపై అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వైరస్ కేసులు తగ్గినా.. దాని తీవ్రత మాత్రం తగ్గలేదని జిల్లాకే చెందిన వైసీపీ నేత మిందిగుడిటి మోహన్ మరణంతో స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో తోట త్రిమూర్తులు వైరస్‌ను జయించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మూడు నెలలకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడుగా ప్రారంభంలో నియమితులయ్యారు. ఆ తర్వాత రామచంద్రాపురం పక్క నియోజకవర్గమైన మండపేట కో ఆర్డినేటర్‌గా ఎంపికయ్యారు. గడిచిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీకి అక్కడ ఓటమే ఎదురైంది. టీడీపీ తరఫున వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా మారిన మండపేటను జయించేందుకు వైసీపీ కాపు సామాజికవర్గానికి చెందిన తోట త్రిమూర్తులను కో ఆర్డినేటర్‌గా నియమించింది. వైసీపీ పెద్దల అంచనాలను నిజం చేస్తూ.. మన్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. చాలా కాలం తర్వాత మండపేట మున్సిపాలిటీలో టీడీపీయేతర జెండా ఎగిరింది. ఇటీవల తోట త్రిమూర్తులను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. 1994లో రామచంద్రాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తోట త్రిమూర్తులు.. 1999లో టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2004లో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోష్ విజయం సాధించారు. 2009లో పీఆర్‌పీ తరఫున పోటీ చేసిన త్రిమూర్తులు.. పిల్లి సుభాష్ చంద్రబోష్ చేతిలో ఓటమి చవిచూశారు. సుభాష్ చంద్రబోష్ రాజీనామాతో జరిగిన 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున త్రిమూర్తులు పోటీ చేసి గెలిచారు. 2014 వరకూ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరి పోటీ చేశారు. ఈ సారి గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చేతిలో ఓడిపోయారు. ఎన్నికలు ముగిసిన మూడు నెలలకు వైసీపీలో చేరిన ఆయన.. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Also Read : కరోనాకు బలైన మరో వైసీపీ నేత