Idream media
Idream media
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబం క్వారంటైన్‌లోకి వెళ్లింది. ముస్తఫా బావ మరిది కుటుంబంలోని వారికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. అంతకుముందు వారందరూ ఓ విందులో కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబం క్వారంటైన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం ముస్తఫా కుటుంబం ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో క్వారంటైన్‌లోకి వెళ్లిన మొదటి కుటుంబం ముస్తఫాదే. కరోనా మహమ్మరికి ధనిక, పేద, అంతస్తు లేదని ఇప్పటికే పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. బ్రిటన్ యువ రాజు ప్రిన్స్ చార్లెస్‌కూ కరోనా సోకడం గమనార్హం. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎవరికైనా కరోనా సోకుతుందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
దేశాన్ని లాక్ డౌన్ చేసిన తర్వాత దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు ప్రధానంగా సోషల్ డిస్టెన్స్ గురించే ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. అందరూ తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 14వ తేదీన లాక్‌డౌన్ ముగియనుంది. అప్పటి లోపు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఎనిమిది వందలు దాటగా.. ఏపీలో ఆ సంఖ్య 12 వద్ద ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది.