Idream media
Idream media
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల ప్రకటనల పర్వం కొనసాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. తాము కూడా రాజీనామా చేస్తామని, తమ నియోజకవర్గాలకు కూడా భారీగా నిధులు కేటాయించాలని కోరుతూ పలువురు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కోరారు. ఈ జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చేరారు. తాజాగా ఆయన సీఎం కేసీఆర్‌కు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. మునుగోడు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ పోటీ చేయబోనని చెప్పారు.
కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గట్టిపట్టున్న నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్. నియోజకవర్గంలో తమను ఇబ్బంది పెడుతున్న గులాబీ సర్కార్‌ను తమ ఎత్తులతో చిత్తు చేస్తున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే.. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌కు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా నడిచారు. ఇద్దరు సోదరులు ఒకే మాటపై ఉంటూ నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమనేలా ప్రకటనలు చేయడంతో కేసీఆర్ సహా గులాబీ నేతలకు ఎలా రిప్లై ఇవ్వాలో తెలియడం లేదు.
రాజకీయంగా నష్టమనే భావనలో గులాబీ శ్రేణులు.
కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే కాదు బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇదే మాదిరిగా ప్రకటన చేశారు. తమ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తెలంగాణలో పలు నియోజకవర్గాల్లోని ప్రజలు కూడా ఇదే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట.. రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలనే డిమాండ్లతో ప్రజలు పోస్టర్లు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఈ తరహా పరిణామాలు కేసీఆర్‌కు రాజకీయంగా నష్టం చేకూరుస్తున్నాయనే భావన గులాబీ శ్రేణుల్లో నెలకొంది. హుజురాబాద్‌కు ఉప ఎన్నికలు రావడం వల్లే.. అక్కడ అభివృద్ధి చేస్తున్నారని, ఇతర నియోజకవర్గాల్లోని సమస్యలపై స్పందించడం లేదనే భావన ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనామాల ప్రకటనలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే ప్రజల డిమాండ్లతో తెలంగాణ సమాజంలో నెలకొంది. ముందు ముందు ఇంకెంత మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తామని ప్రకటిస్తారో చూడాలి.
Also Read : హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో తెరపైకి కొత్తపేర్లు