Idream media
Idream media
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నారు. రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మేట్‌లో లేదని, అది ఉత్తుత్తి రాజీనామా అనే ప్రచార సాగడంతో గంటా మరోసారి స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా చేసి విమర్శలకు చెక్ పెట్టారు. అయితే స్టీల్ ప్లాంట్‌కు మద్ధతుగా టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిరాహారదీక్ష చేయడంతో మీడియా ఫోకస్ ఆ వైపు వెళ్లింది. స్టీల్ ప్లాంట్ కోసం పదవిని వదులుకున్న గంటాకు తగిన ప్రచారం, గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన ప్రకటన చేశారు.
తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారని గంటాపథంగా చెబుతున్న గంటా శ్రీనివాసరావు ఉప ఎన్నికలు అనివార్యమని స్పష్టం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించి మీడియా అటెన్షన్‌ను తన వైపునకు తిప్పుకునే యత్నం చేశారు. అంతేకాదు ఉప ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తిని నిలబెట్టి గెలిపించే ప్రయత్నం చేద్దామనుకుంటున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టారు. తనకు అన్నీ ఇచ్చిన విశాఖకు ఈ మాత్రం చేయడం తన బాధ్యతంటూ సెంటిమెంట్ టచ్ కూడా ఇస్తున్నారు.
గంటా శ్రీనివాసరావు ప్లాన్ మాత్రం అదిరింది. అయితే దాని అమలుపైనే అనేక అనుమానాలున్నాయి. రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే.. నిజంగా గంటా శ్రీనివాసరావు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా..? అనే సందేహాలు ఆయన గత రాజకీయ చర్రిత వల్ల కలుగుతున్నాయి. గంటా శ్రీనివాసరావు, అధికారం… కవలపిల్లల్లాంటివారు. ఏ పార్టీ గెలుస్తుందనుకుంటే.. ఆ పార్టీకిలోకి వెళ్లే అలవాటు గంటాది. అదేదో సినిమాలో అన్నట్లు.. అన్నం తినకుండానైనా ఉంటాను గానీ.. అధికారం లేకుండా అరక్షణమైనా బతకలేననన్నట్లుగా.. గంటా శ్రీనివాసరావు కూడా గెలిచే పార్టీలోకి ఎన్నికలకు ముందే వెళ్లడమో, లేదా గెలిచిన తర్వాత వెళ్లేందుకు యత్నించడమో చేస్తుంటారు.
టీడీపీ తరఫున రాజకీయ రంగ ప్రవేశం చేసిన గంటా.. ఆ పార్టీ తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక సారి పోటీ చేసిన చోట రెండో సారి పోటీ చేయకపోవడం గంటాకు ఉన్న అలవాటు. అదే మాదిరిగా ఆయన పార్టీలు కూడా మారుతుంటారు. 2009లో ప్రజా రాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి, ఆ తర్వాత అది కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మంత్రి పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన గంటా 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయిష్టంగానే టీడీపీ తరఫునే మళ్లీ పోటీ చేశారు.
గంటా గెలిచినా.. టీడీపీ ఓడిపోయింది. అప్పటి నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ నామమాత్రంగా కూడా పాల్గొనడం లేదు. వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం పలుమార్లు జరిగింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. అయితే అవేమీ ఫలించలేదు. బీజేపీలో చేరేందుకు యత్నించారనే ప్రచారం ఇటీవల వరకు సాగింది. ఏ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు టీడీపీలోనే ఉండీ లేనట్లుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించేందుకు గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అయనే మొదట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరి గంటా మనసులోని లక్ష్యం నెరవేరుతుందా..? ఉప ఎన్నికలు వచ్చి, స్టీల్ ప్లాంట్ తో సంబంధం ఉన్న వ్యక్తిని పోటీలోకి దింపుతారా..? అనేవి కాలమే తేల్చాలి. అప్పటి వరకు మీడియాలో గంటా పేరు వినిపిస్తూనే ఉంటుంది.