iDreamPost
android-app
ios-app

అప్పులపై నాడు మీ ఇంట్లో యనమల ఎమన్నాడో మరచిపోయారా బుచ్చయ్య..?

అప్పులపై నాడు మీ ఇంట్లో యనమల ఎమన్నాడో మరచిపోయారా బుచ్చయ్య..?

రాష్ట్రాన్ని రెండేళ్లలో అప్పుల ఊబిలో ముంచేశారని, ప్రజలపై పన్నుల భారం మోపారంటూ టీడీపీ జూమ్‌ మహానాడులో ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆదే సమయంలో ౖÐð సీపీ ప్రభుత్వంపై గోరంట్ల బుచ్చయ్య విమర్శలు చేశారు.

అప్పులపై తీర్మానం ప్రవేశపెట్టే ముందు.. బుచ్చయ్య చౌదరి గత చరిత్ర మరిచిపోయినట్లుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి తెలుగుదేశం పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పుల లెక్కలు చెప్పలనవికావు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై అప్పుల విషయంలో మహానాడు తీర్మానం ప్రవేశపెట్టిన బుచ్చయ్య.. అందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పుల ముఖ చిత్రం కూడా పొందుపరచి ఉంటే ఆ తీర్మానానికి అర్థం ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అప్పు ఎంత..? రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి, తెలంగాణకు వచ్చిన అప్పుల వాటా ఎంత..? టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు ఎంత..? దానిపై వడ్డీ ఎంత..? టీడీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులు ఎన్ని..? వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంత..?

ఈ వివరాలతో తీర్మానం ప్రవేశపెట్టి ఉంటే.. ప్రజలకు నిజానిజాలు తెలిసేవి. కానీ గురివింద సామెత మాదిరిగా.. విమర్శలు చేసి చేతులు దులుపుకున్నారు.

తాము అప్పులు చేస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఆ మొత్తాలను ఎందుకు ఖర్చు పెడుతున్నామో కూడా లెక్కలు చెబుతోంది. అప్పుల ద్వారా సేకరిస్తున్న నిధులు, పన్నుల రూపంలో వస్తున్న రాబడిని ఎలా..? ఎందుకు..? ఖర్చు చేస్తున్నామో బహిరంగంగా ప్రకటనల ద్వారా వైసీపీ ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఏ ఏ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంత మొత్తం అందించామో గణాంక సహితంగా వివరిస్తోంది. అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియజేస్తూ.. పత్రికా ప్రకటనలు కూడా ఇస్తూ.. ప్రజలకు జవాబుదారీగా ఉంటోంది.

రెండేళ్లు వెనక్కి వెళితే.. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత..? అవి ఎందుకు ఖర్చు పెట్టారనే సమాచారం నాటి సీఎం చంద్రబాబు నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు చెప్పేందుకు సాహసం చేయలేదు.

రాష్ట్ర విభజన తర్వాత 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకం జరిగింది. ఈ క్రమంలో ఏపీకి తన వాటాగా దాదాపు 90 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. 2014 నాటికి ఆంధ్రరాష్ట్రం ఏర్పడి 64 ఏళ్లు కాగా, తెలంగాణాతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి 61 ఏళ్లు అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే.. 2014 నాటికి 61 ఏళ్లలో ఏపీ అప్పు దాదాపు 90 వేల కోట్ల రూపాయలు. టీడీపీ ప్రభుత్వ హాయం 2014 నుంచి 2019 మధ్య 2.50 లక్షల కోట్ల రూపాయల కొత్త అప్పు చేశారు. ఇవి కాకుండా టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సరికి కాంట్రాక్టర్లు, విద్యుత్‌ బకాయలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయలు వగైరా.. 60 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండిగ్‌లో పెట్టింది. వైఎస్‌జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.

లెక్కా, పక్కా లేకుండా అప్పులు చేసిన టీడీపీ ప్రభుత్వం.. ఎంత మొత్తం అప్పు చేశాం.. ఎందుకు ఖర్చు చేశామో చెప్పలేని స్థితిలో నాడు ఉంది. నేడు అప్పులపై తీర్మానం పెట్టిన గోరంట్ల.. ఇంట్లోనే నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ‘‘అవకాశం ఉంది కాబట్టే అప్పులు చేశామ’’ని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్మశానంలో స్థలం ఖాళీగా ఉందని వాడుకున్నామనేలా యనమల సమాధానం ఉన్నా.. ఆయన మాత్రం అవకాశం ఉంది.. చేశాం.. అని చెప్పుందుకు ఏ మాత్రం సంకోచించలేదు. అయితే.. ఎంత అప్పు చేశామోనన్నది మాత్రం యనమల చెప్పకపోవడం గమనించాల్సిన అంశం. 2018లో జరిగిన ఈ ఘటన బుచ్చయ్య చౌదరికి గుర్తుందో.. లేదో..?

ఇక పన్నుల విషయానికి వస్తే.. కట్టని అమరావతి రాజధాని కోసం ఐదేళ్లపాటు ప్రతి సేవపై సెస్‌ విధించారు. ప్రతి లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై నాలుగు రూపాయల చొప్పన అమరావతి నిర్మాణం కోసమంటూ అదనంగా వడ్డించారు. ఆర్టీసీ ఛార్జీలతోపాటు సెస్సులు, విద్యుత్‌ ఛార్జీలు ఎడా పెడా పెంచారు. రాష్ట్ర ఆదాయంతోపాటు, అప్పుల ద్వారా వచ్చిన నిధులను ఏం చేశారన్నది..? ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు అంతుచిక్కని విషయం.

ఐదేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారు, దీనికి అదనంగా మరో మూడు లక్షల కోట్ల అప్పులు చేశారు. వీటి ద్వారా లక్ష కోట్ల ఖర్చు అయ్యే అమరావతి నిర్మించలేదు, 50 వేల కోట్ల రూపాయలు వ్యయం అయ్యే పోలవరం పూర్తి చేయలేదు. బాబు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ 87 వేల కోట్ల రూపాయలను రద్దు చేయలేదు, 14 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు.. మరి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, అప్పు చేసిన తెచ్చిన నిధులను నాటి టీడీపీ ప్రభుత్వం దేనికి ఖర్చు చేసినట్లు..? అనే ప్రశ్న సామాన్యుల్లో ఇప్పటికీ వినిపిస్తోంది. మహానాడులో నాటి టీడీపీ ప్రభుత్వ చేసిన అభివృద్ధి.. చేసిన అప్పులపై కూడా తీర్మానం ప్రవేశపెడితే గానీ ఈ ప్రశ్నకు సమాధానం లభించదు.

Also Read : ప‌ర‌నింద రాజ‌కీయాలు స‌రే.. పార్టీ ప‌రిస్థితేంటి?