iDreamPost
android-app
ios-app

బాలయ్యలో ఊహించని మార్పు..!

బాలయ్యలో ఊహించని మార్పు..!

సినీ నటుడుగా, రాజకీయ నాయకుడుగా రెండు పాత్రల్లో విజయవంతమైన అతి తక్కువ మందిలో ఒకరు నందమూరి బాలకృష్ణ. వరుసగా రెండు సార్లు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బాలయ్య. వైసీపీ హవాలోనూ బాలయ్య హిందూపురంలో గెలిచారు. అయితే సినిమాల్లో అలవోకగా డైలాగులు చెప్పే బాలయ్య.. రాజకీయ ప్రసంగాల్లో మాత్రం తడబడుతుంటారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. మాట్లాడిన ప్రతి సారి బాలయ్య నాలుక మడతేస్తారు. ఫలితంగా సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతుంటారు.

సినీమాల్లో మాదిరిగా కాకపోయినా.. కాస్తా కూస్తో రాజకీయాల్లో కూడా తడబడకుండా మాట్లాడాలని, ట్రోలింగ్‌కు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో బాలయ్య ఉన్నట్లు ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బసవతారకం ఆస్పత్రిలో జెండా ఎగుర వేసి మాట్లాడిన తీరుతో అర్థమవుతోంది. అసలు బాలయ్య తన ప్రసంగ శైలిని పూర్తిగా మార్చేశారు.

మీడియా ముందుగానీ, పబ్లిక్‌ ప్రసంగాల్లో గానీ అప్పటికప్పుడు నోటికి వచ్చింది మాట్లాడే బాలయ్య.. పదాల కోసం తడుముకునేవారు. ఆ.. ఊ.. అంటూ రాగాలు తీసేవారు. పక్కన ఉన్న వారు పదాలను అందించిన ఘటనలున్నాయి. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టేలా… ఈ రోజు ప్రసంగ పాఠం రాసుకుని వచ్చి మాట్లాడారు బాలయ్య. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత మాట్లాడిన బాల కృష్ణ పోడియంపై నోట్‌ను పెట్టుకుని మధ్యమధ్యలో చూస్తూ మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బాలయ్య తనకు తానే ఇలా మారారా..? ఎవరి సలహాతోనైనా ఇలా మాట్లాడారా..? ఏమైనా బాలయ్యలో వచ్చిన మార్పు ఆయన అభిమానుల్లో జోష్‌ను నింపుతోంది. బాలయ్య నాలుక మడతేసిన ప్రతిసారి.. ఆయన అభిమానుల్లో నిరుత్సాహం నిండుకుంటుంది. తమ అభిమాన నటుడు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుంటే.. చూడలేకపోయేవారు. ఎలా సమర్థించాలో తెలియక తలలు పట్టుకునేవారు. ఇకపై ముందుగానే నోట్‌ ప్రిపేర్‌ చేసుకుని బాలయ్య మాట్లాడితే.. ఆయన అభిమానుల కన్నా ఆనందించేవారు ఎవరూ ఉండరు. ప్రసంగాలైతే ముందే రాసుకోవచ్చు.. అప్పటికప్పడు మీడియా ముందు మాట్లాడే సమయంలో బాలయ్య ఏం చేస్తారనేది చూడాలి. ఏమైనా బాలయ్యలో వచ్చిన ఈ మార్పు కొనసాగుతుందా..? లేదా..? వేచి చూడాలి.