మిషన్ మజ్ను రిపోర్ట్

టాలీవుడ్ లో వరస అవకాశాలతో మంచి స్పీడ్ మీదున్న రష్మిక మందన్న మరోపక్క హిందీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డెబ్యూ గుడ్ బై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన గొప్ప అనుభూతి తప్ప ఆ మూవీ వల్ల కలిగిన ప్రయోజనం ఏమీ లేదు. అయితే గుడ్ భై కన్నా ముందు పూర్తి చేసిన చిత్రం మిషన్ మజ్ను. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సౌత్ ఇండస్ట్రీ మ్యూజిక్ గురించి రష్మిక చేసిన కామెంట్స్ కొంత వివాదానికి దారి తీశాయి. అయితే ఇది థియేటర్లలో కాకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావడం ఫ్యాన్స్ ని కొంత అసంతృప్తికి గురి చేసింది. అసలింతకీ బొమ్మ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

ఇటీవలే జీ5లో వచ్చిన వెబ్ సిరీస్ ముఖ్బీర్ కు, గతంలో అందరి చేత మన్ననలు పొందిన అలియా భట్ రాజీకి ఈ మిషన్ మజ్నుకి దగ్గరి పోలికలు చాలా ఉన్నాయి. 1974లో ఇండియా మొదటి న్యూక్లియర్ పరీక్ష చేశాక పాకిస్థాన్ ప్రమాదకరమైన ఒక అణుబాంబుని తయారు చేయబోతోందని ఒక గూఢచారి ద్వారా మన రా ఏజెంట్లకు సమాచారం అందుతుంది. శత్రుదేశంలో పని చేసే అమన్ దీప్ సింగ్ (సిద్దార్థ్ మల్హోత్రా) అక్కడ తారిఖ్ పేరుతో నస్రీన్(రష్మిక మందన్న)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయికి చూపు ఉండదు. తారీఖ్ తండ్రికి సంబంధించి ఒక చేదు గతం ఉంటుంది. పాక్ గుట్టు బయటపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ మజ్నులో అమన్ దీప్ ఎలా విజయం సాధించాడు అనేదే అసలు కథ

మొత్తం డెబ్భై దశకం నేపథ్యంలో సాగే బ్యాక్ డ్రాప్ కావడంతో దర్శక నిర్మాతలు అప్పటి వాతావరణాన్ని చక్కగా సృష్టించారు. విజువల్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. డైరెక్టర్ శంతను భాగ్చీ కథనాన్ని నడిపిన విధానం కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా ఉండటంతో రాజీ తరహా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఇందులో మిస్ అవుతాం. ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా వాళ్లకు వేసిన మేకప్పులు అంతగా అతకలేదు. చాలా సన్నివేశాలు అవసరం లేని అయోమయానికి దారి తీస్తాయి. కొన్ని ఎపిసోడ్లు బాగా డిజైన్ చేసుకున్నప్పటికీ మొత్తం చూశాక బాగుందని చెప్పడానికి అవి సరిపోలేదు. థియేటర్ కు వెళ్లే శ్రమ లేకుండా చూసే సౌలభ్యం కాబట్టి మిషన్ మజ్ను అతి తక్కువ అంచనాలతో ఒక లుక్ వేయొచ్చు

Show comments