Idream media
Idream media
నేటి ఉదయం నుంచి కనిపించకుండా పోయిన పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారుల జాడ ఎట్టకేలకు తెలిసింది. అయితే వారిద్దరిని ఒక యాక్సిడెంట్ కేసులో పాకిస్థాన్ పోలీసులు నిర్బంధించినట్లు ఆ దేశ మీడియా సంస్థల ద్వారా సమాచారం లభిస్తుంది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులు ఉదయం 8 గంటల నుంచి అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపింది. ఐతే వారిద్దరిని పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేసినట్లు అక్కడి మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. రోడ్డుపై యాక్సిడెంట్ చేసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పాక్ పోలీసులు తెలియజేశారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తల సారాంశం కాగా పాక్ వైపునుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక సోమవారం ఉదయం నుంచి భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సిఐఎస్ఎఫ్ అధికారుల ఆచూకీ లభించడం లేదు. ఉదయం వారిద్దరు తమ నివాసాల నుండి కార్యాలయానికి బయలుదేరారు. తర్వాత కొద్దిసేపటికే వారు అదృశ్యం కాగా వారిద్దరి మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆందోళన నెలకొంది. ఈ సమాచారము తెలిసిన వెంటనే ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారులకు భారత్ నోటీసులు ఇచ్చింది. కనిపించని అధికారుల బాధ్యత పాక్ ప్రభుత్వానిదే అని భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా హెచ్చరించింది.
కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోని వీసా విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడడంతో వారిద్దరిని భారత్ బహిష్కరించి పాకిస్థాన్‌కి పంపి వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతీకార చర్యగా భారత హైకమిషన్ ఉద్యోగులను పాక్ అరెస్టు చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ భావిస్తోంది.
గత కొంత కాలంగా పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ అధికారులపై ఐఎస్‌ఐ విపరీతమైన నిఘా పెట్టింది. నిఘా పేరుతో తమ అధికారులను వేధించడం గురించి పాక్ విదేశాంగ శాఖకు భారత్ ప్రభుత్వం నిరసన తెలిపింది. జూన్ 4న పాక్‌లోని భారత ఉన్నత దౌత్యాధికారి గౌరవ్ అహ్లువాలియా కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్ ఒకరు ద్విచక్ర వాహనాలపై వెంబడించారు. అదే సమయంలో కొంతమంది అహ్లువాలియా ఇంటి వెలుపల అనుమానాస్పదంగా కనిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగుచూశాయి. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చిన భారత ప్రభుత్వం హైకమిషన్ అధికారులను వేధించడంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
వియన్నా సదస్సు ఒప్పందం ప్రకారము తిరిగి వారు విధులు నిర్వర్తించేందుకు అనుమతించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను కోరింది. ఏదేమైనా పాకిస్తాన్ తన కుటిల రాజనీతిని మార్చుకొని భారత హైకమిషన్,దాని సిబ్బంది యొక్క భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది.