iDreamPost
android-app
ios-app

నిపుణుల సలహాలు లేక చెక్ సినిమాలో దొర్లిన మైనర్ మిస్టేక్స్

నిపుణుల సలహాలు లేక చెక్ సినిమాలో దొర్లిన మైనర్ మిస్టేక్స్

సినిమాల్లో పొరపాట్లు దొర్లడం చాలా సహజం. ఆల్ టైమ్ రికార్డు సాధించిన రెండు ఫబాహుబలి సినిమాల్లో కూడా ప్రేక్షకులు చాలా తప్పులు ఎత్తి చూపించారు. చిన్న చిన్న తప్పుల వల్ల ప్రేక్షకుడికి సినిమా చూసిన అనుభవంలో కలిగే తేడా ఏమీ ఉండదు. అయితే కొంతమంది దర్శకులు తీసిన సినిమాలలో చిన్న తప్పులు కూడా ప్రేక్షకులు కొన్ని సార్లు ఊహించరు. అలాంటి విలక్షణమైన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. రొటీన్ కమర్షియల్ అంశాలతో కాకుండా విభిన్నమైన కథలతో అనుకోకుండా ఒకరోజు, ఐతే, సాహసం లాంటి హిట్ సినిమాలు నిర్మించిన ఆయన నితిన్ హీరోగా తీసిన సినిమా చెక్.

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి డివైడెడ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ భీష్మ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన చిత్రం కావడం, దర్శకుడికి ఉన్న ఇమేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ సాధించింది. చదరంగం క్రీడ నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో ఆ క్రీడకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న తప్పులు దొర్లాయి. చదరంగం గురించి తెలియని వారికి ఇవి తప్పులని తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తెలిసినా కథాగమనానికి, ప్రేక్షకులకి కలిగే అనుభూతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

పావుల పేర్లు

చదరంగం అన్న పేరే చతురంగం నుంచి వచ్చింది. చతురంగ బలాలతో, మంత్రి తోడుగా ఇద్దరు రాజులు అరవై నాలుగు గడులున్న బోర్డు మీద చేసే పోరాటం ఇది. కాజువల్ గా ఆడే ఆటగాళ్లు పావులని ఏనుగు, ఒంటె, గుర్రం, మంత్రి, సైనికుడు అని పిలుస్తారు. కొంచెం సీరియస్ ఆటగాళ్లు వీటిని రూక్, బిషప్, నైట్, క్వీన్, పాన్ అని పిలుస్తారు.

ఒక సన్నివేశంలో హీరోకి జైలులో చదరంగం ఆటని పరిచయం చేసిన శ్రీమన్నారాయణ అతన్ని తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున నేషనల్ ఛాంపియన్ షిప్ లో ఆడించాలని తెలంగాణ చదరంగం అసోసియేషన్ సెక్రటరీ సూచించిన ఆటగాడితో జైలులో గేమ్ ఆడిస్తాడు. అద్దానికి అటూఇటూ ఇద్దరు ఆటగాళ్లు, ఒకవైపు బోర్డు ఉంటుంది, అవతలి నుంచి ఫోనులో నితిన్ తన ఎత్తు చెప్తే కోచ్ ఇటువైపు ఆ ఎత్తుకి తగినట్లు బోర్డు మీద పావులని జరుపుతాడు. చాలాసేపు పావులకి అసలు పేర్లు వాడిన హీరో ఒకసారి “హార్స్ C6” అంటాడు. నేషనల్ ఛాంపియన్ షిప్ లో ఆడబోయే ఆటగాడి నుంచి ఇది ఊహించలేము.

పోటీల ఫార్మాట్

నేషనల్ ఛాంపియన్ షిప్ లో హీరో ఒక్కో ఆటగాడి మీద విజయం సాధిస్తూ ఫైనల్ చేరినట్లు, ఫైనల్లో అప్పటికే బాగా పేరున్న ఆటగాడి మీద విజయం సాధించి ఛాంపియన్ షిప్ సాధించినట్లు చూపించారు. చదరంగంలో ఒక్కో రౌండ్ గెలుచుకుంటూ ఫైనల్ చేరే నాకౌంట్ ఫార్మాట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లోనే ఉంటుంది. మామూలుగా ఎక్కువ మంది ఆటగాళ్లు ఉంటే స్విస్ లీగ్ పద్ధతిలో టోర్నమెంట్ ఆడుతారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అందరు ఆటగాళ్లు అన్ని రౌండ్లు ఆడుతారు. గెలిస్తే ఒక పాయింట్, డ్రా అయితే అర పాయింట్, ఓడితే సున్న పాయింట్లు వస్తాయి. చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే ఆ ఆటగాడిని ఛాంపియన్ గా ప్రకటిస్తారు.

స్వీడన్ లో కామన్వెల్త్ ఛాంపియన్ షిప్

నేషనల్ ఛాంపియన్ షిప్ గెలిచాక హీరోని “మీ తదుపరి లక్ష్యం ఏమిటి?” అని ప్రశ్నించిన విలేకరులతో “స్వీడన్లో జరిగే కామన్వెల్త్ ఛాంపియన్ షిప్” అని సమాధానం చెప్తాడు హీరో. స్వీడన్లో ఈ పోటీలు జరగబోతున్నాయి అని ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు వివిధ పాత్రలతో చెప్పిస్తారు. చివరకు ఆన్ లైన్ లో జైలునుంచే ఆడి విజయం సాధిస్తాడు. కరోనా కారణంగా అలా ఆడించారు అని మనం అర్థం చేసుకోవాలి.

కామన్వెల్త్ అంటే బ్రిటన్ పాలించిన దేశాల సమాఖ్య. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలో కెనడా లాంటి దేశాలు ఇందులో ఉంటాయి. నాలుగు సంవత్సరాలకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడలలో కూడా ఈ దేశాలే పాల్గొంటాయి. అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటన్ చేత పాలింపబడిన దేశం అయినప్పటికీ కామన్వెల్త్ లో సభ్యురాలు కాదు. స్వీడన్ కామన్వెల్త్ దేశాల లిస్టులో లేదు. కాబట్టి కామన్వెల్త్ ఛాంపియన్ షిప్ స్వీడన్ లో జరిగే అవకాశం లేదు.

ప్రపంచ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్

ఈ సినిమా జరిగిన కథాకాలం 2019 అని చెప్తారు. సినిమా చివరిలో ఉరిశిక్ష కోసం వెయిట్ చేస్తున్న హీరో ప్రపంచ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ తో ఒక గేమ్ ఆడాలని కోరినట్టు అందుకు ఆనంద్ అంగీకరించినట్టు చూపిస్తారు. ఆనంద్ తో ఆడిన గేమ్ చివరిదశలో ఉండగా హీరో తప్పించుకున్నట్టు చూపిస్తారు. ఆనంద్ 2013 వరకే ఛాంపియన్ గా ఉన్నాడు. ఆ సంవత్సరం ఆనంద్ మీద విజయం సాధించి, అప్పటినుంచి మాగ్నస్ కార్ల్ సెన్ ఛాంపియన్ గా ఉన్నాడు.

అయితే క్లాసికల్, రాపిడ్, బ్లిట్జ్ మూడు ఫార్మాట్లలో ఛాంపియన్ షిప్ సాధించిన విశ్వనాధన్ ఆనంద్ ని భారత అభిమానులు ఎప్పటికీ ప్రపంచ ఛాంపియన్ గానే భావిస్తారు అని సర్దిచెప్పుకోవచ్చు.

గేమ్, మ్యాచ్ రెండూ ఒకటి కాదు

చదరంగంలో ఇద్దరు ఆటగాళ్లు ఒకసారి ఆడిన ఆటని గేమ్ అంటారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య కొన్ని గేములు జరిగితే దాన్ని మ్యాచ్ అంటారు. ఆ మ్యాచ్ లో జరిగిన గేముని మ్యాచ్ గేమ్ అంటారు. ఈ సినిమాలో గేమ్ కీ, మ్యాచ్ కీ తేడా లేనట్లు, రెండూ ఒకటే అన్నట్టు వాడారు.

ఇవేవీ చెప్పుకోదగ్గ తప్పులు కానీ, ఈ తప్పుల వల్ల సినిమాకి వచ్చిన నష్టం కానీ ఏమీ లేదు.