iDreamPost
android-app
ios-app

జ్యోతుల నెహ్రూ విషయంలో హూందా రాజకీయానికి అర్ధం చెప్పిన వైసీపీ మంత్రులు

  • Published Aug 19, 2021 | 4:38 AM Updated Updated Aug 19, 2021 | 4:38 AM
జ్యోతుల నెహ్రూ విషయంలో హూందా రాజకీయానికి అర్ధం చెప్పిన వైసీపీ మంత్రులు

వైసీపీ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉంటూ టీడీపీలోకి జంప్ చేసిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చేరారు. హుటాహుటీన ఆయన్ని తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కొందరు ఆయన్ని ఫోన్లో పరామర్శలు చేస్తున్నారు. చివరకు చంద్రబాబు కూడా ఫోన్ కే పరిమితమయ్యారు. కానీ వైసీపీ నేతలు మాత్రం పార్టీల విషయం పక్కన పెట్టి ఆయన ఆరోగ్యం పట్ల చూపిన శ్రద్ధ ఆశ్చర్యకరంగా మారింది. స్వయంగా ఇద్దరు మంత్రులు ఆస్పత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు కనిపిస్తాయి. అవకాశం పేరుతో ఆయన వేసిన తప్పటడుగులు కారణంగా ఆయన రాజకీయాలు నియోజకవర్గ స్థాయిలోనే మిగిలిపోయినట్టు స్పష్టమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబుని నమ్ముకుని జగన్ ని వీడి ఉండకపోతే ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండేవారనడంలో సందేహం లేదు. అయినా ఆయన 2014లో గెలిచిన శాసనసభా పక్ష ఉప నేతగా ఉంటూ వైఎస్సార్సీపీని వీడారు. చంద్రబాబు మంత్రి పదవి ఆశపెట్టడంతో అటు మళ్లారని ప్రచారం జరిగింది. కానీ చివరకు చంద్రబాబు మాత్రం జ్యోతుల నెహ్రూ ఆశలపై నీళ్లు జల్లారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో నెహ్రూ ఓటమి పాలయ్యారు.

అంతకుముందు కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో పీఆర్పీ కారణంగా మరోసారి ఒడిదుడుకులు ఎదురయిన అనుభవం ఉంది. 1991లో తోట వెంకటాచలం మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలతో టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 1994,99 ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ 2004లో తోట నరసింహం చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవిని నమ్మి పీఆర్పీలో చేరారు. కానీ వరుసగా రెండోసారి కూడా తోట నరసింహం చేతిలో ఓడిపోవడంతో ఆయన రాజకీయ భవితవ్యం గందరగోళంగా మారింది.

2012లో జగన్ గూటికి చేరారు. సీనియర్ నేత కావడం, కీలక సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహించడంతో జ్యోతుల నెహ్రూకి జగన్ తగిన ప్రాధాన్యతనే ఇచ్చారు. 2014లో అధికారానికి వస్తారనే వాతావరణంలో జ్యోతుల నెహ్రూ కూడా జగ్గంపేట నుంచి గెలిచేందుకు జగన్ ఛరిష్మా తోడ్పడింది. దానికి తగ్గట్టుగానే స్వల్ప ఓట్ల దూరంలో సీఎం సీటు దక్కకపోయినా జగన్ మాత్రం అసెంబ్లీలో నెహ్రూని అన్ని విధాలా ప్రోత్సహించారు. చివరకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాలో కీలక చర్చల్లో ఆయనకు తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. అయినప్పటికీ జగన్ మీద గురిపెట్టి ఎమ్మెల్యేలకు వల వేసిన చంద్రబాబుకి జ్యోతుల నెహ్రూ చిక్కారు. తాను గతంలో చంద్రబాబు మీద చేసిన విమర్శలన్నీ మరచిపోయి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆపార్టీ తరుపున బరిలో దిగి మొన్నటి ఎన్నికల్లో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు.

ఇలాంటి సుదీర్ఘ చరిత్ర, అనేక తప్పటడుగల ప్రస్థానం కలిగిన నెహ్రూ విషయంలో జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. నేరుగా ఆస్పత్రికి వెళ్లి వ్యవసాయ మంత్రి కన్నబాబు, బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుతో పాటుగా కాపు కార్పోరేషన్ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఆస్పత్రిలో కోలుకుంటున్న జ్యోతుల నెహ్రూకి ఉపశమనం కలిగించేలా వ్యవహరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ పరామర్శ చేసిన మంత్రుల తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ నేతలు వ్యవహరించిన ధోరణి ని అభినందిస్తున్నారు.