Idream media
Idream media
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మూడు రోజుల క్రితం బడ్జెట్ పై మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కూడా ఫైర్ అయ్యారు. అనంతరం ఈ నెల 5న హైదరాబాద్ కు ప్రధాని రానున్న విషయంపై మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆహ్వానం పలికేందుకు వెళ్తానని, దేని దారి అదేనని చెప్పారు. ఇప్పుడు అనూహ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన ఓ ప్రకటన రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలకడంతో పాటుగా, వెళ్లేటప్పుడు వీడ్కోలు పలకడానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించినట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి రామానుజాచార్యుల వెయ్యేల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు హాజరుకానున్నారు. భగవత్ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీని చినజీయర్ స్వామి గతంలోనే స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ముచ్చింతల్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ప్రధానికి వివరించారు. దీంతో ఫిబ్రవరి 5న విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మోడీ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దివ్య సాకేతానికి ప్రత్యేక రోడ్డు నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విమానం ల్యాండ్ అవగానే రన్‌వే నుంచి నేరుగా ముచ్చింతల్ చేరేలా రోడ్డు వేస్తున్నారు. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రహరీ గోడను కూడా కూల్చేశారు. రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇక దివ్య సాకేతానికి సమీపంలో 3 హెలిప్యాడ్‌లను నిర్మించారు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తారా? లేదా హెలికాప్టర్ ద్వారా వస్తారా? అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రధానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇదంతా బాగానే ఉంది కానీ.. ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ వెళ్లకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరపున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానికి స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్లడం లేదు. ఆయనకు బదులు ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపాలని సమ్మతించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఇటీవలి కాలంలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం కొనసాగుతోంది. తమ అసంతృప్తిని తెలిపేందుకే కేసీఆర్ వెళ్లడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా పరిశీలిస్తే.. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య దూరం మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
Also Read : విశిష్టం.. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం..