Idream media
Idream media
రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ఎదగాలని పావులు కదుపుతున్న మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సొంత నియోజకవర్గంలోనే ఒంటరిని చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికీ టీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న రాజేందర్ నుండి పార్టీని వేరు చేసేందుకు అధిష్ఠానం కొత్త కసరత్తులు మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ చేజారకుండా హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్‌ఎస్ పట్టు బిగిస్తోంది. విజయం సాధిస్తుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేచిచూసే ధోరణి ప్రదర్శించిన నాయకులు ‘కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తాం… టీఆర్‌ఎస్‌లోనే ఉంటాం’ అని ప్రకటిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా కొత్త నాయకత్వాన్ని రంగంలోకి దింపి హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఎదురులేకుండా చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ను రంగంలోకి దింపనుంది.
మంత్రివర్గం నుంచి తొలగించండి ప్రభుత్వం చేతిలో పని. అందుకే చిటికలో ఆ పని పూర్తిచేశారు కేసీఆర్. కానీ.. ప్రజల నుంచి వేరు చేయడం అనేది తేలికకాదు. అందుకే.. హుజూరాబాద్ లో రసవత్తరమైన రాజకీయం కొనసాగుతోంది. ఈటలను బర్తరఫ్ చేసిన దగ్గర్నుంచి ఆయన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన అధిష్టానం.. మంత్రి గంగుల కమలాకర్ కు ఆ బాధ్యతను అప్పగించింది. ఈ బాధ్యతను మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు కేసీఆర్. అదే పనిమీద ఉన్న గంగుల.. మొత్తం హుజూరాబాద్ మీదనే దృష్టి పెట్టారు. ఈటల వెంట వెళ్తామన్న నేతలను పిలిచి మాట్లాడుతున్నట్టు సమాచారం. హుజూరాబాద్‌పై ‘ఆపరేషన్ గంగుల’ పేరిట బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కమలాపూర్, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటుండగా, త్వరలోనే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ టి.హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ రంగంలోకి దిగుతారన్న ప్రచారం కమలాపూర్‌లో సాగుతోంది.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురై ఇరవై రోజులు గడుస్తున్నా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ను వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న వ్యూహాలు సత్పలితాలు ఇస్తున్నాయి. రాజేందర్ తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లాక పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇరవై రోజుల పాటు వేచిచూసిన పలువురు టీఆర్‌ఎస్ సీనియర్లు బుధవారం ప్రెస్‌మీట్ల ద్వారా తమ వైఖరి స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టాక తర్వాత తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేస్తుండగా, ఒక్కొక్కరుగా ఆయన శిబిరం నుంచి బయట పడుతున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సమయంలో రాజేందర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పలువురు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారు. కరీంనగర్‌లో మకాం వేసిన గంగుల కమలాకర్‌ను కలిసొచ్చి హుజూరాబాద్, కమలాపూర్‌ల్లో ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ఇక హరీశ్ రంగంలోకి దిగితే హుజూరాబాద్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.
Also Read : ఈ గవర్నర్ మాకొద్దు!