Idream media
Idream media
రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా పదమూడు జిల్లాలు కాస్తా.. 26 జిల్లాలు అయ్యాయి. రెవెన్యూ మండలాలు పెరిగాయి. ఇప్పుడు ఈ నిర్ణయంతో మరోసారి మూడు రాజధానుల ప్రస్తావన వస్తోంది. ఇచ్చిన హామీ మేరకు ప్రతీ లోక్‌సభ స్థానాన్ని జిల్లాగా మార్చిన జగన్.. గతంలో ప్రకటించినట్లుగానే అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులను కూడా ఏర్పాటు చేసి తీరతారనే వాదనలు మొదలయ్యాయి.
“దక్షిణాఫ్రికా మాదిరిగా మనం కూడా మూడు రాజధానులు పెట్టుకోవచ్చు. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉండొచ్చు” అని అసెంబ్లీ సాక్షిగా 2019, డిసెంబర్ 17 న ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆ ప్రకటన కొందరికి ఇబ్బందికరంగా మారినా రాష్ట్రమంతా కొత్త ఆశలు చిగురించాయి. ప్రధానంగా దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకుని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. పనుల కోసం ఏళ్ల తరబడి సుదీర్ఘ దూరంలో ఉన్న రాజధానులకు తరలిపోయే ఆ ప్రాంత వాసులు తమ విశాఖకే రాజధాని వస్తుందన్న ఆశతో సంబరాలు చేసుకున్నారు.
జగన్ ప్రకటించినట్లుగానే మూడు రాజధానుల వైపు వడివడిగా అడుగులు వేశారు. 2020, జనవరి 20న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు, ఆమోదముద్ర పడింది. విశాఖ, కర్నూలు, అమరావతి మూడు చోట్ల రాజధానులను వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 22న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. 2020, జూన్ 16న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు రెండవసారి శాసనసభలో ఆమోదం పడింది. అలాగే 2020 జులై 31న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : మొన్న సముద్రం.. నేడు కాలుష్యం.. విశాఖపై అదే విషం..
మూడు రాజధానుల ప్రక్రియ సాగుతుండగా.. రాజకీయ దురుద్దేశంతో కొందరు, అవగాహనలోపంతో ఇంకొందరు, నచ్చక మరికొందరు.. ఇలా సుమారు 93 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు, నోటిఫికేషన్లు చెల్లవంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. ప్రభుత్వ నిర్ణయాలు, కమిటీల నివేదికలు రాజ్యాంగ విరుద్దమంటూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు బృందం పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మన్నవ సుబ్బారావు, లంకా దినకర్, మరికొంతమంది వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఈ పిటిషన్లు అడ్డుతగులుతూ వచ్చాయి. బిల్లులోని కొన్ని లోపాల కారణంగానే అడ్డంకులు వస్తున్నట్లు భావించిన జగన్ సర్కారు బిల్లులను ఉపసంహరించుకుంది.
అయితే, ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగడంతో.. జిల్లాలు ఎలా వచ్చాయో, మూడు రాజధానులు కూడా అలాగే వస్తాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఎవరినీ తప్పుదోవ పట్టించడానికి కాదని స్పష్టం చేశారు. అలాగైతే ఒక జిల్లాకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్‌టీఆర్ పేరు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల సంఖ్య పెరిగితే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వస్తాయని, దాంతో అభివృద్ధి పనులు మరిన్ని చేపట్టవచ్చునని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
Also Read : జగన్ ను తప్పుగా అర్థం చేసుకున్నామా? ఆ సామాజిక వర్గంలో ఆలోచన